కొలంబో: ఆసియాకప్(Asia Cup 2023)లో రొటేషన్ పద్ధతిలో ప్లేయర్లకు అవకాశం కల్పించే ఆలోచనలో టీమిండియా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ .. రెండు రోజుల పాటు జరగడం వల్ల.. టాప్ ఆర్డర్ బ్యాటర్లతో పాటు బౌలర్లపై వత్తిడి పడింది. అయితే ఇవాళ గ్రూప్ 4 స్టేజ్‌లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంకతో మ్యాచ్ జరగనున్నది. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విక్టరీని సొంతం చేసుకున్న టీమిండియా జట్టు.. ఇవాళ్టి మ్యాచ్ కోసం కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో సూర్యకుమార్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్‌కు ఛాన్స్ ఇచ్చే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాకిస్థాన్‌ను ఓడించిన 12 గంటల వ్యవధిలోనే మరో భారీ మ్యాచ్ ఆడాల్సి వస్తున్న నేపథ్యంలో భారత ఆర్డర్లో మార్పులు అనివార్యంగా తోస్తున్నాయి. భారతీయ క్రికెటర్లకు ఫిట్నెస్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. రొటేషన్ పద్ధతిని ఆచరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై అతికష్టంగా నెగ్గిన శ్రీలంకకు.. రెండు రోజుల బ్రేక్ దొరికింది. దీంతో ఆ జట్టు ఇవాళ ఇండియాతో ఆడేందుకు సమరోత్సహంతో ఉంది. అయితే వరుసగా మూడో రోజు వన్డే ఆడుతున్న ఇండియా.. ఈ మ్యాచ్‌లో తన ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు సవాల్ విసురుతోంది.