కాన్బెర్రా : భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో నిర్వాహకులు ఆటను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. ఆట నిలిచే సమయానికి భారత్.. 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టచ్‌లోకి వచ్చినట్టే కనిపించినా అతడి విన్యాసాలను అలరించాలని ఆశించిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
సూర్యతో పాటు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19, 4 ఫోర్లు) ఎప్పట్లాగే ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించినా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఎదుర్కున్న మూడో బంతికే సూర్య.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డీప్ స్కేర్ లెగ్ మీదుగా కండ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఐదో ఓవర్ తర్వాత వాన రావడంతో ఆటకు 45 నిమిషాల అంతరాయం కల్గింది. 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్ మళ్లీ మొదలవగా సూర్య, గిల్ వేగంగా ఆడటంతో భారత రన్‌రేట్ 10కు తగ్గకుండా సాగింది. కానీ పదో ఓవర్లో మళ్లీ పలకరించిన వాన ఎంతకూ తగ్గలేదు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం (అక్టోబర్ 31న) మెల్బోర్న్లో జరుగుతుంది.
2 భారత్ నుంచి టీ20ల్లో 150+ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో సూర్య.. రోహిత్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. 205 సిక్సర్లతో హిట్‌మ్యాన్ అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాడు