ముల్లాన్‌పూర్: భారత టీ20 జట్టులో పెను మార్పులకు సెలెక్టర్లు రంగం సిద్ధం చేశారు. గత 18 నెలలుగా వరుసగా విఫలమవుతూ పూర్తిగా ఫామ్ కోల్పోయిన స్టార్ బ్యాటర్ సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, భవిష్యత్తు ప్రణాళికల నుంచి కూడా పూర్తిగా పక్కన పెట్టాలని భావిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడానికి ముందే ఈ కీలక నిర్ణయాన్ని గురువారం జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేసే అవకాశం ఉంది. సూర్యను తప్పించి శ్రేయస్ అయ్యర్ లేదా ఫ్యూచర్ స్టార్‌గా భావిస్తున్న హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. అయ్యర్ వైపు మొగ్గు చూపుతుండగా హెడ్ కోచ్ గంభీర్ మాత్రం అయిష్టత వ్యక్తం చేస్తూ సంజు శాంసన్ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ, బ్యాటర్‌గా నిలకడలేమి శాంసన్‌కు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో తిలక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తిలక్ నాయకత్వ నైపుణ్యాలను పరీక్షించేందుకు ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత-ఏ జట్టుకు అతడిని కెప్టెన్‌గా కూడా నియమించారు.