న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో తిరోగమన చర్యలు మొదలయ్యాయి. క్రికెట్ పరిపాలనలో కొందరి గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ జస్టిస్ లోధా చేసిన సిఫారసులకు మంగళం పాడేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐపై తమ పట్టు నిరూపించుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తనయుడు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్‌కుమార్ ధుమాల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నా యి.
తమ పదవులకు ప్రతిబంధకంగా మారిన కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై సవరణల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీసీసీఐ పెద్దలకు సానుకూల ఫలితం దక్కింది. వరుసగా ఆరేండ్లు (రాష్ట్ర, బీసీసీఐ) పదవుల్లో కొనసాగేందుకు వీలు లేకుండా జస్టిస్ లోధా సిఫారసులను సవరించేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. బోర్డు సంస్కరణల్లో పలు కీలక మార్పులకు అత్యున్నత న్యాయస్థానం మార్పులు చేసేందుకు మొగ్గుచూపింది. వరుసగా రెండు రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పలు సంస్కరణలకు అంగీకారం తెలిపింది. అమీకస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ చేసిన ప్రతిపాదనలను ధర్మాసనం బీసీసీఐ ముందు ఉంచింది. బోర్డు తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జస్టిస్ లోధా సిఫారసుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు తీవ్ర అభ్యంతరం తెలిపిన బీహార్ క్రికెట్ సంఘం తరఫు న్యాయవాది అఖిలేష్‌కుమార్ వాదనలను సుప్రీం తిరస్కరించింది.
సవరణలకు సై..
లోధా ప్రతిపాదించిన పలు సంస్కరణలు సరళతరం కాబోతున్నాయి. తాము వినిపించిన వాదనల ప్రకారం నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, కేంద్ర సర్వీస్ అధికారులు అనర్హులు. అయితే తాజా పిటీషన్లో పబ్లిక్ ఆఫీస్‌లకు సుప్రీం అనుమతి ఇచ్చింది. పలువురు మాజీ క్రికెటర్లు పబ్లిక్ ఆఫీస్‌లలో ఉన్న వైనాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
2025 వరకు పదవుల్లో షా, గంగూలీ!
సుప్రీం కోర్టు తాజా తీర్పుతో సౌరవ్ గంగూలీ, జైషా తిరిగి తమ పదవుల్లో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కూలింగ్ ఆఫ్ పీరియడ్(వరుసగా ఆరేండ్లు) నిబంధనను సుప్రీం సరళీకరించడంతో గంగూలీ, జైషాతో పాటు అరుణ్‌కుమార్ ధుమాల్ 2025 వరకు తమ పదవులను అట్టిపెట్టుకునే అవకాశం లభించినట్లయ్యింది. వాస్తవానికి షా, గంగూలీ పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. అయినా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశామన్న కారణంతో ఇన్ని రోజులు పదవులును పట్టుకుని వేలాడారు. షెడ్యూల్ ప్రకారం ఈ సెప్టెంబర్ ఆఖరి వారంలో ఎన్నికలు జరుగాల్సి ఉంది. అయితే కోర్టులో విచారణ సాకుతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. సుప్రీం తాజా తీర్పుతో బోర్డు పెద్దలకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా అమిత్ షా తనయుడు జై షాకు ఇన్నాళ్లు ప్రతిబంధకంగా మారిన కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై సుప్రీం తీర్పు సానుకూలంగా మారింది. దీంతో వచ్చే నెలలో ఏజీఎం నిర్వహించే అవకాశముంది. ఇందులో జైషాతో పాటు గంగూలీ, అరుణ్‌కుమార్ ధుమాల్ మరో మూడేండ్ల పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసే అవకాశముంది. ఇదే జరిగితే 2025 వరకు కీలక పదవుల్లో వారే కొనసాగడం ఖాయం.