టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. గెలిస్తే గానీ ముందంజ వేయలేని పరిస్థితుల్లో కీలకమైన నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో జూలు విదిల్చింది. తొలుత షకిబ్ అల్హసన్ అర్ధసెంచరీతో అదరగొట్టడంతో బంగ్లాకు పోరాడే స్కోరు దక్కింది. లక్ష్యఛేదనలో బంగ్లా బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ కుదేలైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన డచ్ టీమ్ చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది.
T20 World Cup | కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): సూపర్-8 దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. గురువారం కింగ్స్టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌పై ఆ జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్, 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి వైపున నిలిచారు. 20 ఓవర్లలో ఆ జట్టు 134/8 కే పరిమితమైంది. సిబ్రండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (22 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. షకిబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఒడిదొడుకుల మధ్యే సాగింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ శాంటో (1) వికెట్ కోల్పోయిన ఆ జట్టు.. 4వ ఓవర్లో ప్రమాదకర లిటన్ దాస్ (1) ఔట్ కావడంతో కష్టాల్లో చిక్కుకుంది. కానీ తాంజీద్ హసన్ (35)తో కలిసి సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ బంగ్లాను ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 48 రన్స్ జోడించారు. తాంజీద్ స్థానంలో వచ్చిన తౌవిద్ హృదయ్ (9) విఫలమయ్యాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీతో పూర్తిచేసిన షకిబ్.. ఆఖర్లో మహ్మదుల్లా (25), జేకర్ అలీ (14 నాటౌట్) అండతో బంగ్లాకు పోరాడగలిగే స్కోరును అందించాడు.
భారీ ఛేదనేమీ కాకపోయినా నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సైతం నెమ్మదిగానే సాగింది. 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసిన లెవిట్‌ను 5వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. 3 ఫోర్లు కొట్టి జోరుమీదున్న మ్యాక్స్ ఓడౌడ్ (12).. తాంజిమ్ షకిబ్ 6వ ఓవర్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. ధాటిగా ఆడిన విక్రమ్‌జిత్ (26) కూడా మహ్మదుల్లా 9వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. రిషద్ హోసెన్ 15వ ఓవర్లో.. క్రీజులో కుదురుకున్న సిబ్రండ్తో పాటు బస్ డి లిడెను ఔట్ చేసి డచ్ జట్టుకు డబుల్ షాకులిచ్చాడు. ఆఖరి 4 ఓవర్లలో నెదర్లాండ్స్ విజయానికి 44 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు లోయర్ ఆర్డర్ కూడా చేతులెత్తేయడంతో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది.
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 159/5 (షకిబ్ 64 నాటౌట్, తాంజీద్ 35, మికెరెన్ 2/15, ఆర్యన్ 2/17).
నెదర్లాండ్స్: 20 ఓవర్లలో 134/8 (సిబ్రండ్ 33, విక్రమ్‌జిత్ 33, రిషద్ 3/33, టస్కిన్ 2/30)