హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్-19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఉత్కంఠగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఎస్ఆర్హెచ్.. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. సొంతమైదానంలో అశేష ఆరెంజ్ ఆర్మీ అభిమానుల మద్ధతుతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్, 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర శతకంతో 20 ఓవర్లకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెడ్ (26 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. హైదరాబాద్ నిర్దేశించిన రికార్డు ఛేదనలో క్యాపిటల్స్.. 20 ఓవర్లకు 195/9 వద్దే ఆగిపోయింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సమీర్ రిజ్వి (28 బంతుల్లో 41, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 37, 1 ఫోర్, 3 సిక్స్‌లు) పోరాటం సరిపోలేదు. ఇషాన్ మలింగ (4/32) అద్భుత స్పెల్‌తో క్యాపిటల్స్ బ్యాటర్లకు కళ్లెం వేయగా హర్ష్ దూబే (3/12) లోయరార్డర్ పనిపట్టాడు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఇది మూడో అపజయం కాగా సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం.
‘షేక్’ ఆడించాడు!
ఈ సీజన్లో వరుసగా ఏడోసారి టాస్ ఓడిపోయినా మొదట బ్యాటింగ్ చేయడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. ఎప్పట్లాగే ‘ట్రావిషేక్’ జోడీ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఫామ్‌లేమితో తంటాలుపడుతున్న హెడ్ (37) బంతిని బాదడంలో ఇబ్బందులుపడ్డా మరో ఎండ్‌లో ‘పులి’ (అభిషేక్‌ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా పిలచుకునే పేరు) మాత్రం శైలికి తగ్గట్టుగానే బాదుడు మంత్రాన్ని జపించాడు. నాలుగో ఓవర్ నుంచే ఊపందుకున్న అతడు.. రాణా ఓవర్లో బ్యాక్‌టుబ్యాక్ సిక్సర్లు దంచాడు. పవర్ ప్లేలో 74/0తో నిలిచిన ఎస్ఆర్హెచ్ తర్వాత మరింత జోరు పెంచింది. అక్షర్ ఓవర్లో తొలి బంతికి డబుల్‌తో అతడి ఫిఫ్టీ పూర్తయింది. అదే ఓవర్లో హెడ్ సైతం సిక్స్ కొట్టినా ఐదో బంతికి రిజ్వికి క్యాచ్ ఇవ్వడంతో 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అతడి స్థానంలో వచ్చిన ఇషాన్.. కుల్దీప్ విసిరిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ దంచగా అభిషేక్ కూడా ఓ సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. నటరాజన్ ఓవర్లో అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద రాణా మిస్ చేయడంతో బతికిపోయిన అతడు.. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీతో 90ల్లోకి వచ్చాడు. తర్వాత రాణానే వేసిన ఓవర్లో రెండు సిక్సర్లతో 47 బంతుల్లోనే అతడి శతకాన్ని సాధించాడు. ఐపీఎల్లో అతడికి ఇది రెండో సెంచరీ. ఇషాన్ వేగంగా ఆడకపోయినా అభిషేక్‌కు అండగా నిలువగా దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ తర్వాత అభిషేక్ అలిసిపోయినట్టు కనిపించినా ఆఖర్లో బాదుడు బాధ్యతలను క్లాసెన్ భుజానికెత్తుకున్నాడు. ఎంగిడి ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా రెండు భారీ సిక్స్‌లు కొట్టిన అతడు.. చివరి ఓవర్లో 4, 6, 4తో మెరుపులు మెరిపించాడు.

క్యాపిటల్స్‌కు మలింగ కళ్లెం
ఛేదనను ఢిల్లీ వేగంగానే ఆరంభించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. మూడో ఓవర్లోనే మధుశంక.. నిస్సంక (8)ను వెనక్కి పంపినా రాహుల్ (37)తో జతకలిసిన రాణా దూకుడుగా ఆడాడు. ఈ ద్వయం సన్‌రైజర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని 45 బంతుల్లోనే 86 రన్స్ జోడించింది. ముఖ్యంగా రాణా.. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడటంతో 9 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 98/1తో పటిష్టంగానే కనిపించింది. కానీ రెండో స్పెల్‌కు వచ్చిన సకిబ్.. పదో ఓవర్లో రాహుల్‌ను ఔట్ చేసి క్యాపిటల్స్‌కు షాకిచ్చాడు. 11 ఓవర్ వేసిన మలింగ.. వరుస బంతుల్లో రాణాతో పాటు ప్రమాదకర మిల్లర్నూ ఔట్ చేయడంతో ఢిల్లీని కోలుకోనీయకుండా చేశాడు. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 88 పరుగులు అవసరమైన దశలో మళ్లీ అతడే.. స్టబ్స్ (27)ను బోల్తా కొట్టించడంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోశ్ (14) కూడా అతడి బౌలింగ్‌లోనే బలయ్యాడు. ఆఖర్లో రిజ్వి పోరాటం ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లకు 242/2 (అభిషేక్ 135*, క్లాసెన్ 37*, అక్షర్ 1/23); ఢిల్లీ: 20 ఓవర్లకు 195/9 (రాణా 57, రిజ్వి 41, మలింగ 4/32, హర్ష్ 3/12)