అహ్మదాబాద్ : భారీ స్కోర్లు కొడుతూ.. పెద్ద టార్గెట్లను అలవోకగా కరిగిస్తూ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ టైటాన్స్ పేసర్లు కొట్టిన దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ నేలకు దిగింది. బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో జీటీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు ఇచ్చిన 169 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ 14.5 ఓవర్లలో 86 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కగిసో రబాడ (3/28), జేసన్ హోల్డర్ (3/20) దెబ్బ కొట్టారు. తొలుత సాయి సుదర్శన్ (44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61), వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) అర్ధశతకాలతో రాణించగా టైటాన్స్ 20 ఓవర్లకు 168/5 స్కోరు చేసింది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ తలోరెండు వికెట్లు పడగొట్టారు. 12 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదో, ఓవరాల్‌గా ఎనిమిదో విజయంతో జీటీ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. అన్నే మ్యాచ్‌ల్లో ఐదో ఓటమితో రైజర్స్ మూడో స్థానానికి పడిపోయింది.
కొత్త బంతితో రబాడ, మహ్మద్ సిరాజ్ మిడిల్ ఓవర్లలో హోల్డర్ నిప్పులు చెరగడంతో హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. జట్టుకు వెన్నెముకలాంటి ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (6) ఘోరంగా నిరాశపరచడంతో రైజర్స్ ఏదశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. స్కోరుబోర్డుపై పరుగు చేరకుండానే సిరాజ్ తొలి ఓవర్లో హెడ్ వికెట్ కోల్పోయిన రైజర్స్‌కు రబాడ చుక్కలు చూపించాడు. పిచ్‌పై పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ ఖతర్నాక్ బంతులతో రఫ్ఫాడించడంతో ఎస్ఆర్హెచ్ ఆపసోపాలు పడింది. తన వరుస ఓవర్లలోఅభి, ఇషాన్ (11), స్మరణ్ (9)ను ఔట్ చేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి 34/4తో హైదరాబాద్ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్ (14) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. సలీల్ అరోరా (16)తో కలిసి కాసేపు మాత్రమే ప్రతిఘటించాడు. రబాడ అద్భుత స్పెల్ తర్వాత ప్రసిధ్ కృష్ణ, హోల్డర్ జీటీ బౌలింగ్ దాడిని కొనసాగించి రైజర్స్‌ను దెబ్బకొట్టారు. పదో ఓవర్లో కీపర్ క్యాచ్‌తో అరోరాను ప్రసిధ్ పెవిలియన్ చేర్చితే.. ఆ వెంటనే క్లాసెన్‌తో పాటు నితీశ్ రెడ్డి(2) పని పట్టిన హోల్డర్ 13వ ఓవర్లో శివంగ్ కుమార్ (4)ను ఎనిమిదో వికెట్‌గా ఔట్ చేయడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది.
క్లిష్టమైన వికెట్‌పై టాపార్డర్‌లో సాయి సుదర్శన్, మిడిల్లో ఆల్‌రౌండర్ సుందర్ సత్తా చాటడంతో గుజరాత్ మంచి స్కోరే చేసింది. యువ పేసర్ ప్రఫుల్ హింగే వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పవర్ ప్లేలో టైటాన్స్ 34 రన్స్ మాత్రమే చేయగలిగింది. సీజన్లో నిలకడగా ఆడుతున్న గిల్ (5).. మూడో ఓవర్లో హింగే విసిరిన రెండో బంతిని మిడాన్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అదే ఊపులో హింగే.. ఆరో ఓవర్లో బట్లర్ (7)నూ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో నిశాంత్ (22), వాషింగ్టన్‌తో కలిసి సాయి టైటాన్స్‌ను ఆదుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో నియంత్రించినా సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ పడిపోకుండా ఆడాడు. జోరుమీద కనిపించిన నిషాంత్‌ను కమిన్స్ ఔట్ చేసినా అతడి స్థానంలో వచ్చిన వాషింగ్టన్.. సాయికి అండగా నిలిచి స్కోరుబోర్డును నడిపించాడు. ఈ క్రమంలో సుదర్శన్ వరుసగా మూడోఅర్ధశతకాన్ని పూర్తిచేశాడు. కానీ ఫిఫ్టీ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని సకిబ్.. సాయిని ఔట్ చేయడం ద్వారా విడదీశాడు. మలింగ వేసిన 19వ ఓవర్లో సుందర్.. 4,4, 6తో బాదగా చివరి ఓవర్లోనూ 10 రన్స్ రావడంతో టైటాన్స్ స్కోరు 160 మార్కు దాటింది.
1 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2019లో ముంబైతో మ్యాచ్‌లో 96 రన్స్‌కు ఆలౌటైన రికార్డు బ్రేక్ అయింది.
గుజరాత్: 20 ఓవర్లకు 168/5 (సుదర్శన్ 61, సుందర్ 50, హింగే 2/17, సకిబ్ 2/37);
హైదరాబాద్: 14.5 ఓవర్లలో 86 ఆలౌట్ (కమిన్స్ 19, సలిల్ 16, హోల్డర్ 3/20, రబాడ 3/28)
