Sunil Gavaskar : దిగ్జజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం క్రికెట్ ప్రేమికులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ను మాత్రం ఏమాత్రం ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే ‘పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు, గబ్బాలో జరిగిన మూడో టెస్టు తుది జట్లలోకి అశ్విన్‌ను తీసుకోకపోవడమే అతడి రిటైర్మెంట్ నిర్ణయంలో కీలకంగా మారాయి’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
తన అభిప్రాయం సరైనదే అనడానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘వచ్చే ఏడాది వరకు ఇండియా పెద్దగా టెస్టులు ఆడేది లేదు. కేవలం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ మాత్రమే ఉంది. ఎలాగూ విదేశాల్లో సిరీస్‌లకు తనను తుది జట్టులోకి తీసుకోవడం లేదని, ఇంగ్లండ్ టూర్‌కు కూడా తీసుకునే అవకాశం లేదని అశ్విన్ భావించి ఉంటాడు. అందుకే రిటైర్మెంట్కు ఇదే సమయమని భావించి తన నిర్ణయం ప్రకటించి ఉంటాడు’ అని గవాస్కర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘ఎందుకంటే గతంలో భారత జట్టు విదేశీ టూర్లను పరిశీలిస్తే ఎక్కడ కూడా అశ్విన్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు. దక్షిణాఫ్రికాకు వెళ్లినా, ఆస్ట్రేలియాకు వెళ్లినా, ఇంగ్లండ్‌కు వెళ్లినా అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అందుకే ముందు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఉన్నా, తుది జట్టులో తనకు స్థానం దక్కదనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు’ అని గవాస్కర్ అన్నారు.
అశ్విన్ మరికొన్ని రోజులు ఆడి ఉంటే అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసేవాడా..? అని మీడియా ప్రశ్నించగా.. అతడు కచ్చితంగా అనిల్ రికార్డును బ్రేక్ చేసేవాడని చెప్పారు. అయితే అశ్విన్ నంబర్ వన్ స్థానం కావాలని కోరుకోలేదని అన్నారు. కోరుకుని ఉంటే కచ్చితంగా సాధించేవాడని తెలిపారు. పెర్త్ టెస్టు కాగానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడని, అయితే రోహిత్ శర్మ నచ్చజెప్పడంతో అడిలైడ్ టెస్టు ఆడాడని గవాస్కర్ వెల్లడించారు. ఈ విషయాన్ని రోహిత్ శర్మనే స్వయంగా చెప్పిన విషయాన్ని గవాస్కర్ గుర్తుచేశారు.