దుబాయ్: ఘనమైన ముగింపు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నా.. అన్నీ మనం అనుకున్నట్లు జరుగవని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సారథ్యంపై సన్నీ మాట్లాడుతూ.. ‘ఇది నిరాశ కలిగించేదే. ప్రతి ఒక్కరూ ఘనంగా ముగించాలని కోరుకుంటారు. కోహ్లీ కూడా అలాగే భావించి ఉంటాడు. కానీ ఇలాంటి విషయాలు మనం ముందు అనుకున్నట్లో, లేక అభిమానులు ఆశించినట్లో జరగవు. డాన్ బ్రాడ్‌మన్ విషయాన్నే తీసుకుంటే.. అతడి కెరీర్లో 100 సగటు సాధించేందుకు చివరి మ్యాచ్‌లో నాలుగు పరుగులే అవసరమయ్యాయి. కానీ ఆ మ్యాచ్‌లో డాన్ డకౌటయ్యాడు. సచిన్ కూడా తన 200వ టెస్టులో శతకంతో ముగించాలని అనుకొని ఉంటాడు. కానీ 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఎప్పుడూ మనం ఊహించినట్లు జరుగదు. అయితే విరాట్ బెంగళూరుకు ఒక బ్రాండ్ తీసుకొచ్చాడు. అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది’ అని అన్నాడు. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ముందే ప్రకటించగా.. సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక వచ్చే సీజన్లో ఆటగాడిగా బెంగళూరు తరఫున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. విరాట్ సారథ్యంలో 140 మ్యాచ్‌లాడిన బెంగళూరు 66 మ్యాచ్‌ల్లో నెగ్గి 70 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.