దేశం తరఫున ఆడిన మొదటి మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మరిచిపోలేను. మొదటిసారి జాతీయ జట్టు జెర్సీ వేసుకోగానే అందులోంచి ఏదో తెలియని పరిమళం వచ్చినట్టు నాకు అనిపించింది. ఈ 19 ఏండ్లలో బాధ్యతలు, ఒత్తిడి, ఆనందం.. ఇలా ఎన్నో జ్ఞాపకాలున్నాయి. వాటన్నింటినీ నెమరువేసుకుంటుంటే ఎంతో బాగుంది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పగానే మా నాన్న అర్థం చేసుకున్నాడు. కానీ మా అమ్మ, నా భార్య మాత్రం ఏడ్చేశారు. జాతీయ జట్టు కోసం ప్రతి క్షణం కష్టపడ్డా’
– ఛెత్రి
Sunil Chhetri | ఢిల్లీ: రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్ జట్టుకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బైచుంగ్ భుటియా వారసుడిగా జాతీయ జట్టులోకి వచ్చి 19 ఏండ్ల పాటు తనదైన ఆటతో మెప్పించిన ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా జూన్ 6న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో ‘బ్లూ టైగర్స్’ తరఫున ఆఖరి మ్యాచ్ (కువైట్‌తో) ఆడనున్నాడు. గురువారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియో ద్వారా తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. 2002లో ఢిల్లీలోని సిటీ క్లబ్‌కు ఆడుతూ కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ‘మోహన్ బగాన్’ దృష్టిలో పడ్డ 17 ఏండ్ల ఈ బెంగాల్ స్ట్రైకర్.. 2002లో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా అరంగేట్రం చేశాడు. 2005లో భారత్.. పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఛెత్రి అక్కడ్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. భారత్ తరఫున 150కి పైగా మ్యాచ్‌లు ఆడిన అతడు 94 గోల్స్ కొట్టాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో (128), మెస్సీ (106) తర్వాత యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో మూడో స్థానం (ఓవరాల్‌గా 4వ స్థానం) ఛెత్రిదే కావడం గమనార్హం.
భారత ‘ఫుట్‌బాల్‌లో విరాట్ కోహ్లీ’గా అభిమానులు పిలుచుకునే ఛెత్రి.. 2007, 2009, 2012లలో బ్లూ టైగర్స్ నెహ్రూ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011, 2015, 2021, 2023లో సాఫ్ చాంపియన్‌షిప్ నెగ్గడంలో అతడిదే కీ రోల్. 2018, 2023లో ఛెత్రి సారథ్యంలోనే భారత జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలిచింది. 2018 నుంచి 2023 దాకా ఫిఫా ర్యాంకింగ్స్‌లో బ్లూ టైగర్స్ టాప్-100లో నిలిచింది. 2012లో జాతీయ జట్టు పగ్గాలు అందుకున్న ఛెత్రి.. భారత్‌కు అత్యధిక కాలం పనిచేసిన సారథిగా రికార్డులకెక్కాడు. దేశ అత్యున్నత పురస్కారం ‘ఖేల్త్న్ర’ అందుకున్న ఏకైక ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రినే కావడం విశేషం.
మ్యాచ్‌లు గోల్స్
150 94 (భారత్‌కు)
358 158 (లీగ్స్)