లివర్‌పూల్: ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన శుక్రవారం జరిగిన వేర్వేరు బౌట్లలో యువ బాక్సర్లు సుమిత్ కుందు, నీరజ్ ఫోగట్ ముందంజ వేశారు. పురుషుల 75కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుమిత్..5-0 తేడాతో మహమ్మద్ అల్ హుస్సేన్(జోర్డాన్)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే ఇరువురు బాక్సర్లు దీటుగా తలపడ్డారు. ఎక్కడావెనుకకు తగ్గకుండా ఒకరిపై ఒకరు పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. అయితే జోర్డాన్ బాక్సర్‌పై ఒకింత ఆధిపత్యం ప్రదర్శించిన సుమిత్ క్లీన్పంచ్లతో రిఫరీలను ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్ ముగిసే సరికి మెరుగైన ఆధిక్యంలో ఉన్న సుమిత్..ఆఖరి రౌండ్లోనూ అదే దూకుడు కనబరిచాడు.
ప్రిక్వార్టర్స్‌లో యూరోపియన్ చాంపియన్ రామి కివాన్(బల్గేరియా)తో సుమిత్ తలపడుతాడు. మరోవైపు మహిళల 65కిలోల బౌట్లో నీరజ్ ఫోగట్ 3-2తో క్రిస్టా కోవాలైనెన్(ఫిన్లాండ్)పై గెలిచింది. 70కిలోల విభాగంలో సనామచా చాను తర్వాత రౌండ్లోకి ప్రవేశించగా, హర్ష్ చౌదరీ ఓటమితో వెనుదిరిగాడు.