Solly Adam | క్రికెట్ అంటే ఇష్టం అన్నవాళ్లకు ఆ ఇంట్లో ఆతిథ్యం ఇట్టే దొరుకుతుంది. ఆటలో మెలకువలు నేర్చుకోవడానికి ఎక్కడలేని ప్రోత్సాహమూ లభిస్తుంది. ఆటగాళ్లకు అన్నీతానే అయిపోతాడు ఆ ఇంటి యజమాని. క్రికెట్ క్లబ్లో చేర్పిస్తాడు. డబ్బుల్లేవంటే కొలువు చూపిస్తాడు. అవసరం ఏదైనా అతనికి చెబితే చాలు.. అది తీరుస్తాడు. ఆయన ఇంట ఆతిథ్యం పొందినవాళ్లు, ఆయన చల్లని చూపులు పడ్డవాళ్లు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అజహరుద్దీన్, సచిన్, వినోద్ కాంబ్లి, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అజయ్ జడేజా… చెబుతూ పోతే మూడు వందలమందికిపైగా అంతర్జాతీయ క్రీడాకారులకు ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టి, ఆటలో రాటుదేల్చిన శక్తి ఆయన.
ఇంగ్లండ్‌లోని డ్యూస్‌బరీలో ఉండే ఆ ఇల్లు క్రికెటర్లకు స్వర్గధామం. ఈ ఇంటి యజమాని పేరు సోలీ ఆడమ్. అన్ అఫీషియల్ క్రికెట్ సెలెక్టర్‌గా పేరుపొందిన సోలీ పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. పగవాడికి కూడా రాకూడదనుకునే ఎన్నో కష్టాలను అనుభవించాడు. అంచెలంచెలుగా ఎదిగి.. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో స్టార్ అనిపించుకున్నాడు. కౌంటీల్లో పాల్గొని, సత్తా చాటాలనుకునే ఎందరో క్రికెటర్లకు నిలువ నీడయ్యాడు. గెలుపు ట్రోఫీ అందించాడు. ఆయన జీవిత చరిత్ర ‘సోలీ ఆడమ్.. బియాండ్ బౌండరీస్’ పేరుతో పుస్తకంగా వచ్చింది. దానిని చిత్రిక పట్టిన రచయిత వర వంటపాటి మన తెలుగువాడే కావడం విశేషం.
సూరత్‌కు దగ్గర్లోని సిమ్లాక్ అనే ఊరిలో పుట్టాడు సులేమాన్ ఆడమ్. వాళ్ల అమ్మ.. ‘సోలీ’ అని ముద్దుగా పిలుచుకునేది. ఇంట్లో వాళ్లూ అలాగే పిలిచేసరికి.. అదే అసలు పేరుగా స్థిరపడి పోయింది. సోలీ వాళ్ల తాత ఇబ్రహీం ఆడమ్. ఇంటి దగ్గర పిండిమిల్లు నడిపేవాడు. అతనికి ఆరుగురు కొడుకులు, ఒక కూతురు. ఆడబిడ్డ లాహోర్ నగరంలోని ఓ సంపన్న కుటుంబానికి కోడలిగా వెళ్లింది. వాళ్లకు ఫ్యాక్టరీలు ఉండేవి. సోలీ వాళ్ల నాన్న, బాబాయిలు.. ఆ ఫ్యాక్టరీలలో కొన్నాళ్లు పనిచేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోయింది. ఆ సమయంలోనే సోలీ వాళ్ల నాయనమ్మ చనిపోయింది. తాత మరో పెళ్లి చేసుకోవడంతో.. ఆ ఇంట్లో ఉండటానికి సయీద్, అతని సోదరులకు ఇబ్బందిగా అనిపించింది. చిన్న కొడుకు మినహా మిగతావాళ్లంతా.. లాహోర్‌కు వెళ్లిపోయారు. అక్క ఇంటి తలుపు తట్టారు. కొన్నాళ్లు అక్కడే పని చేశారు.
అయితే, కంపెనీల్లో ఉండే సాధారణ తనిఖీలు సయీద్‌కి నచ్చలేదు. ఆత్మాభిమానం అడ్డుపడి.. మనసు సొంతూరి మీదికి మళ్లింది. ఇంటి (ఇండియా)కి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్యాపిల్లల్ని వెంటబెట్టుకుని, చెప్పాపెట్టకుండా బొంబాయి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేస్తే.. ‘ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. మీరు వస్తున్నట్టు ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీరు డామన్ వెళ్లండి’ అని చెప్పాడు ఇబ్రహీం. చేసేది లేక 1950లో పోర్చుగీసువారి పాలనలో ఉన్న డామన్ చేరుకుంది ఆ కుటుంబం. అక్కడ దొరికిన పనిచేస్తూ ఉండేవాడు సయీద్. తండ్రి కూడా అప్పుడప్పుడూ డబ్బు పంపేవాడు.
‘ఇక్కడి పరిస్థితులు బాగున్నాయి. మీరు ఇంటికి రండి’ అంటూ ఒకనాడు తండ్రి కబురు పంపాడు. 1952లో సయీద్ కుటుంబం సొంతూరికి చేరుకుంది. అక్కడ కొన్ని నెలలు సోలీ జీవితం సంతోషంగా గడిచింది. చెల్లెలు, ఇరుగుపొరుగు స్నేహితులతో ఆడుతూపాడుతూ ఉండేవాడు. ఓరోజు పోలీసులు వచ్చారు. ‘మీరంతా సూరత్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి’ అని హుకుం జారీచేసి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి వద్దామని అందరూ బయల్దేరారు. అప్పుడు.. మధుబాల, దిలీప్ కుమార్ నటించిన ‘ఆన్’ సినిమా విడుదలైంది. సూరత్ వెళ్లాక ఆ సినిమా చూడాలని అనుకున్నారంతా.
పోలీస్ స్టేషన్‌కి చేరుకొని సాయంత్రందాకా ఎదురు చూశాక.. ఇన్స్పెక్టర్ వచ్చాడు. ‘మీలాగా అటు నుంచి ఇటు వచ్చిన వాళ్లందరినీ వెనక్కి పంపిస్తున్నాం. ఏమీ అనుకోవద్దు!’ అని చెప్పి.. అందరినీ ఓ ట్రక్కు ఎక్కించాడు. సరిహద్దుకు సమీపంలోని ఎడారిలో వదిలేశారు. చేతిలో కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేవు. దప్పిక, ఆకలి.. దారిలో ఎవరైనా తారసపడితే ప్రాథేయపడి దాహం తీర్చుకున్నారు. ఆ ఎడారిలో నాలుగు రోజులు నడుచుకుంటూ కరాచీ చేరుకున్నారు.
జేబులో పైసా లేదు. నడిచి నడిచీ అలసిపోయి ఉన్నారు. తలదాచుకోడనికీ దిక్కులేదు. కరాచీలో కనికరించినవాళ్లు లేరు. దీంతో అక్కడి నుంచి మళ్లీ లాహోర్కి పయనమయ్యారు. సయీద్ సోదరి మంచి మనసుతో వారిని ఆదరించింది. తమ్ముడి కుటుంబానికి ఆశ్రయమిచ్చింది. తమ్ముణ్ని మళ్లీ పనిలో పెట్టించింది. అక్కడ రెండేళ్లు గడిచాయి. సయీద్‌కు ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు. మళ్లీ అదే సమస్య. ఆత్మాభిమానం అడ్డుపడింది. 1954 నాటికి భార్యాపిల్లలతో మళ్లీ కరాచీ చేరుకున్నాడు. గుజరాతీలు ఎక్కువగా ఉండే నదిమాబాద్లోని ఓ భవనం మెట్ల కింద.. చిన్నగదిని అద్దెకు తీసుకున్నాడు. దాదాబాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో నెలకు 90 రూపాయల జీతానికి పనిలో కుదిరాడు.
ఇంట్లో కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా లేకపోవడంతో.. డ్రైనేజ్ హోల్ ఓపెన్ చేసి మలమూత్ర విసర్జన చేసేవాళ్లు. అపరిశుభ్రత కారణంగా జబ్బుపడి.. చిన్న పిల్లలిద్దరూ చనిపోయారు. శ్మశానానికి పోతే స్థానికులు అడ్డుకున్నారు. ఆ దయనీయ స్థితిలో స్థానిక గుజరాతీ ముస్లింలు కొంత స్థలం కొంటే.. పిల్లల్ని అందులో ఖననం చేశారు. అప్పుడే.. వాళ్లందరూ కలిసి ‘గుజరాతీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ’ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలోనే దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు సంపన్న దంపతులు ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు కూడా గుజరాతీ మూలాలున్నవాళ్లే. ఫ్యాక్టరీ కార్మికుల కోసం ‘నతాల్ రెసిడెన్షియల్ కాలనీ’ పేరుతో ఇండ్లు నిర్మించారు. అందులో ఒక ఇంటిని సయీద్‌కి కేటాయించారు. అక్కడే సోలీకి తమ్ముడు పుట్టాడు. సోలీ బాబాయిలు కూడా లాహోర్‌ని విడిచిపెట్టి కరాచీ వచ్చేశారు. దొరికిన పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకున్నారు.
నతాల్ కాలనీలో బడికి వెళ్తూ క్రికెట్ ఆడేవాడు సోలీ. ఆ కాలనీ క్రికెట్ క్లబ్లో ఎక్కువగా పెద్దవాళ్లే ఆడేవాళ్లు. పదేళ్ల వయసులోనే సోలీ ఆ క్లబ్లో చేరాడు. అయితే, చిన్నవాడని తనకు అవకాశాలు ఇచ్చేవాళ్లు కాదు. దాంతో ఎక్స్ట్రా ప్లేయర్‌గా ఉండేవాడు. క్రికెట్ ఆడాలన్న ఆరాటంతో.. నటాల్ కాలనీ జూనియర్స్ క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేశాడు సోలీ. సోలీ మంచి ఆటగాడని పేరొచ్చాక.. సీనియర్ క్లబ్లో అవకాశాలు దక్కాయి. తొమ్మిదో తరగతి చదివేనాటికి ఆ జట్టుకి కెప్టెన్ కూడా అయ్యాడు. ఒకసారి సోలీ మేనత్త అయేషా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ సామాజిక పరిస్థితులు, పని అవకాశాలను గమనించింది. పాకిస్థాన్‌కు తిరిగి వచ్చాక.. తన సోదరులను ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో పనికి వెళ్లమని ప్రోత్సహించింది.
తానే ఆర్థిక సహాయం కూడా అందించింది. సోలీ వాళ్ల నాన్న 1954లో ఇంగ్లండ్ ప్రయాణమయ్యాడు. తర్వాత తొమ్మిదేండ్లకు 1963, అక్టోబర్ 14న ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు సోలీ. అప్పుడు తన చేతిలో ఉన్ని ఒక పౌండ్ మాత్రమే! డ్యూస్‌బరీలో ఉన్న తండ్రిని కలిశాడు. పదహారేళ్లు నిండని కారణంగా పరిశ్రమలో పని చేసేందుకు సోలీని అనుమతించలేదు. దాంతో.. విక్టోరియా పాఠశాలలో ఫౌండేషన్ కోర్సులో చేరాడు. ఆసియా ఖండం నుంచి వసల వచ్చిన కార్మికుల పిల్లల కోసం ఏర్పాటుచేసిన పాఠశాల అది. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణుడైన తర్వాత.. జౌళి పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు సోలి. ఈలోగా ‘ఆడమ్’ కుటుంబ సభ్యులంతా కరాచీ నుంచి డ్యూస్‌బరీ చేరుకున్నారు.
కార్మికుడిగా పనిచేస్తున్నా.. సోలీకి మాత్రం క్రికెట్ మీదే ప్రాణం గుంజుతూ ఉండేది. ఫ్యాక్టరీలో ఆదివారం సెలవు కావడంతో.. క్రికెట్ ఆడే అవకాశం కోసం తిరిగేవాడు. ఈక్రమంలోనే ఆసియా దేశాల నుంచి వచ్చినవాళ్లు ఏర్పాటు చేసుకున్న ‘బాట్లీ ముస్లిం క్రికెట్ క్లబ్’ పరిచయమైంది. వాళ్లతో ఆడిన ట్రయల్ మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. బౌలర్‌గా నాలుగు వికెట్లు తీయడంతోపాటు బ్యాట్‌తోనూ దీటుగా ఆడి నలభై పరుగులు సాధించాడు. దాంతో ‘ఎక్స్లెంట్ పెర్ఫార్మెన్స్’ అంటూ తోటి ఆటగాళ్లతో పొగిడించుకున్నాడు. కానీ, క్లబ్ నిబంధనల ప్రకారం మ్యాచ్‌కి 20 పెన్నీలు కట్టాలి. దాంతో డబ్బుల్లేక ఆ అవకాశం వదలుకున్నాడు. అయినా.. సోలీలో మాత్రం ఆడాలనే ఆశ చావలేదు. బరిస్టల్ ట్రేడ్ హాల్ క్లబ్లో చేరాడు. ఇందులోనైతే డబ్బులు కట్టకుండానే ఆడే అవకాశం ఉంటుంది. ఇది బ్రిటిష్ క్రీడాకారుల క్లబ్. ఈ క్లబ్ తరఫున డ్యూస్‌బరీ డిస్ట్రిక్ట్ లీగ్‌లో ఆడాడు.
వారంలో ఆరు రోజుల పనికి 3.5 పౌండ్ల వేతనం ఇచ్చేవారు. ఆ డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకునేవాడు. డబ్బులు పోగయ్యాక ఒక కారు కూడా కొన్నాడు. కార్మికుడిగా పనిచేస్తూనే.. మిగతా సమయంలో ట్యాక్సీ నడిపేవాడు. కార్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో.. చల్లని వాతావరణంలో కార్ మెకానిక్ దొరకడం కష్టంగా ఉండేది. కాబట్టి, పని తెలిసినవాళ్లకు డబ్బులు ఎక్కువగా వచ్చేవాళ్లు. ఆ చలిలో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి కార్లు మరమ్మతు చేసేవాడు. అలా అతని చేతికి చాలా డబ్బు వచ్చేది. దాంతో కొద్దికాలానికి కంపెనీలో పని మానేశాడు. మెకానిక్‌గానే బిజీ అయిపోయాడు.
సంపాదన కూడా పెంచుకున్నాడు. బరిస్టల్ ట్రేడ్ హాల్ క్లబ్లో మంచి క్రికెటర్లు ఉండేవాళ్లు. కానీ, వాళ్లు విపరీతంగా మద్యం తాగేవాళ్లు. ఆ ధోరణి సోలీకి నచ్చేదికాదు. ఆ క్లబ్‌ను వదిలేసి.. బాట్లీ ముస్లిం క్రికెట్ క్లబ్లో చేరాడు. 1965 నుంచి 69 వరకూ ఈ క్లబ్లో ఆడాడు. ఆ తర్వాత విట్లీ లోయర్ క్లబ్లో చేరి.. అందులో రెండేళ్లపాటు ఆడాడు. అక్కడినుంచి ‘క్రాస్ బ్యాంక్ ముస్లిం క్లబ్’కు చేరుకున్నాడు. ఇక్కడ ఆడుతున్నప్పుడే.. సోలీ సక్సెస్ రేట్ పెరిగింది. 1973లో లీగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ గెలిచాడు. ఆ జట్టుకి కెప్టెన్ అయ్యాడు. సోలీకి అనేక క్లబ్బుల్లో అభిమానులు, స్నేహితులు కూడా పెరిగారు. ఆడిన ప్రతిచోటా.. మంచి ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. అనేక లీగుల్లో గెలిచి.. ఆశించని అవార్డులెన్నో అందుకున్నాడు.
తనకు పరిచయం ఉన్న ఒక పెట్రోల్ బంక్ ఓనర్.. అద్దె లేకుండా నడుపుకోమంటూ సోలీకి తన బంక్‌ను అప్పగించాడు. అప్పులు చేసి మరీ ఆ పెట్రోల్ బంక్‌ని తీసుకున్నాడు సోలీ. ట్యాక్సీ నడుపుతూ, కార్లు రిపేర్ చేస్తూ.. కుటుంబసభ్యుల సహకారంతో ఆ బంక్‌ను విజయవంతంగా నిర్వహించాడు. లాభాల్లో నడిపించాడు. అప్పటినుంచి ఇక సోలీ ఆడమ్ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా కష్టపడి సంపాదించిన డబ్బుతో డ్యూస్‌బరీలో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. వాళ్ల నాన్న, బాబాయిలతోనూ ఇండ్లు కొనిపించాడు. ఆ తర్వాత మరియం అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు మరో బంక్ పెట్టాడు. ఇలా.. కొద్దికాలానికే ఏడు పెట్రోల్ బంకులు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. వాటి నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఇబ్బడిముబ్బడిగా వచ్చిన లాభాలతో.. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు సోలీ. ఇరవై కార్లు, ఎనిమిది బస్సులు కొన్నాడు. ట్రావెల్ సర్వీసు నిర్వహించాడు. డ్యూస్‌బరీలో పాతిక ఇండ్లను కొనుగోలు చేశాడు.
ఈ క్రమంలో బాట్లీ ముస్లిం క్రికెట్ క్లబ్ సోలీని మరోసారి ఆహ్వానించింది. అందులో చేరి.. 1977 నుంచి నాలుగేళ్లపాటు ఆ క్లబ్‌తో ఆడాడు. క్లబ్లో మంచి ప్లేయర్స్ ఉన్నా.. కెప్టెన్ ధోరణితో టీమ్ ఎప్పుడూ ఓడిపోతూ ఉండేది. ఆ అసంతృప్తితోనే ఆ క్లబ్‌ని వీడి.. బ్రిటిష్ వాళ్ల బాట్లీ క్రికెట్ క్లబ్లో చేరాడు. 1983 – 87 మధ్యకాలంలో ఈ క్లబ్ తరఫున ఆడుతూ.. మంచి క్రికెటర్‌గా రాణించాడు. దాంతో బాట్లీ క్లబ్ టీమ్ కెప్టెన్ బాధ్యతలను సోలీకి అప్పగించారు. ఆ క్లబ్‌కి కెప్టెన్ అయిన తొలి ఆసియా పౌరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు సోలీ. తన కెప్టెన్సీలోనే ప్రతిష్ఠాత్మకమైన జాక్ హామ్షేర్ కప్, హెవీ గులెన్ కప్ చాంపియన్‌షిప్ (1986), సెంట్రల్ యార్క్‌షైర్ లీగ్ ప్రీమియర్ చాంపియన్‌షిప్ (1987)ని బాట్లీ క్లబ్ జట్టు గెలుచుకున్నది. సక్సెస్ఫుల్ క్రికెట్ కెప్టెన్‌గా సోలీని ఆకాశానికెత్తుతూ ఇంగ్లండ్ పత్రికలు వార్తలు కూడా ప్రచురించాయి.
సోలీ సాధించిన విజయాల కన్నా తను విపరీతంగా ప్రేమించిన క్రికెట్ గురించే ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది. సోలీ బాల్యమంతా వలసలు, పేదరికం, ఆకలితోనే గడిచింది. యవ్వనంలో క్రికెట్‌ని ప్రేమిస్తూనే.. పేదరికాన్ని గెలిచేందుకు పోరాడాడు. సోలీ ప్రేమలోనూ, పోరాటంలోనూ గెలిచాడు. తనలాంటి వాళ్లను కూడా గెలిపించాలని కలలుకన్నాడు. సోలీకి ఆదరణ వచ్చిన తర్వాత క్లబ్ క్రికెటర్లలో క్రేజ్ పెరిగింది. ఇతను ఎవరిని టీమ్‌లోకి తీసుకోమమంటే.. ఆ క్రికెటర్‌ను ఆయా క్లబ్‌లు తీసుకునేవి. మట్టిలో మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను వెతికిపట్టాడు. బొంబాయి జట్టులో రంజీ ఆడే చంద్రకాంత్ పండిట్, రాజు కులకర్ణీ, లాల్ చంద్ రాజ్‌పుత్, రవి ఠక్కర్లను ఇంగ్లండ్‌లోని క్రికెట్ క్లబ్బులను ఒప్పించి, అందులో చేర్పించాడు.
క్రికెట్ నేర్చుకునే రోజుల్లో ఆర్థిక సమస్యలు వస్తే వాళ్లకు ఉద్యోగాలిప్పించాడు. ఆ తర్వాత వీళ్లంతా భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. తను ఏ క్లబ్బులో ఆడితే ఆ క్లబ్ ఆడే అవకాశం కల్పించేవాడు. అబ్దుల్ అజీమ్ (హైదరాబాద్), మెహందీ షేక్ (బరోడా), బరున్ బర్మన్ (కోల్‌కతా), మసూద్ అన్వర్ (పాకిస్థాన్), పాల్ బ్లాక్లీ, డేవిడ్ బాటీ, రషీద్ ఖాన్ (పాకిస్థాన్)లను సోలీ క్లబ్ క్రికెట్‌కి పరిచయం చేశాడు. క్లబ్ క్రికెట్లో ఆరితేరిన వీళ్లంతా.. ఆ తర్వాత ఆయా దేశాల జట్లకు ఎంపికయ్యారు. తనతో క్రాస్ బ్యాంక్ ముస్లిం క్లబ్ తరఫున ఆడిన మెహందీ షేక్.. భారత జట్టుకు కోచ్‌గానూ పని చేశాడు.
ఇంగ్లండ్ ప్రతికలకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో.. ‘సెంట్రల్ యార్క్‌షైర్ లీగ్ (సీవైఎల్)లో అన్ని టైటిల్స్ గెలిచాను. నేను గెలవాడనికి ఇంకేం లేదు. ఇంతకంటే ఉన్నతమైన దానికోసం వేరే లీగుల్లో ఆడతాను’ అని ప్రకటించాడు సోలీ. అన్నట్టే 1988లో బాట్లీ క్రికెట్ క్లబ్‌ని వదిలేశాడు. సెంట్రల్ యార్క్‌షైర్ లీగ్ కంటే ఉన్నతమైన బ్రాడ్ఫోర్డ్ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. స్పెన్ విక్టోరియా టీమ్‌లో చేరాడు. సోలీ ప్రతిభను గుర్తించిన ఆ టీమ్ కెప్టెన్.. తన బాధ్యతలను సోలీకి అప్పగించాడు. నయా కెప్టెన్ ప్రయోగాలతో ఆ టీమ్ అనేక విజయాలు సాధించింది.
ప్రీస్టీ కప్ చాంపియన్‌షిప్ (1990), బ్రాడ్ ఫోర్డ్ లీగ్ చాంపియన్ షిప్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ బౌలర్ ఇలా ఎన్నో బహుమతులు గెలిచాడు సోలీ. ఆ లీగ్ ద్వారా గొప్ప పేరుగడించాడు. ఆ విజయాల పరంపరను గుర్తించిన కంబర్లాండ్ మైనర్ కౌంటీ.. తమ జట్టు తరఫున ఆడేందుకు సోలీకి ఆహ్వానం పంపింది. అప్పటికీ ఆయన వయసు 46 సంవత్సరాలు. సాధారణంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే వయసది. అయినా.. సోలీ కౌంటీలో అడుగుపెట్టాడు! ఇది కూడా ఒక రికార్డ్! రెండేళ్లపాటు కౌంటీ క్రికెట్లోనూ సత్తాచాటాడు. అయితే, ఇక్కడ ఆటగాళ్ల ప్రతిభ కంటే రూల్స్‌కే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుదనీ, ఆటను ఆస్వాదించలేమని కౌంటీ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. మళ్లీ స్పెన్ విక్టోరియా క్లబ్లో చేరాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించినా.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తరఫున ఆడాలని సోలీ ఏనాడూ అనుకోలేదు. ఆయనకు కావాల్సింది ఆటగాళ్లు మాత్రమే. నలభై ఏళ్ల క్రితం క్రికెట్ ఆటగాళ్లకు ఆదాయం చాలా తక్కువ. ఒక మ్యాచ్‌లో వచ్చిన పారితోషికంతో తర్వాత మ్యాచ్ వరకు ప్రాక్టీస్ అవసరాలు కూడా తీరేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్బుల నుంచి వెళ్లిపోకుండా.. క్రికెటర్లను కాపాడుకునే బాధ్యతను కూడా సోలీనే భుజాన వేసుకున్నాడు. తనకున్న పరిచయాలతో వారిని స్థానిక ఫ్యాక్టరీల్లో, షాపుల్లో ఉద్యోగాల్లో పెట్టించేవాడు.
ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే క్లబ్ క్రికెట్ ఆడుతూ ఆటలో ఆరితేరారు చాలామంది క్రికెటర్లు. అబే కురివిల్ల, జాన్ హుడ్, ఇక్బాల్ ఖాశీం, మహ్మద్ ఖైఫ్, మదన్‌లాల్, వసీం జాఫర్, వీవీఎస్ లక్ష్మణ్.. మరెందరో క్రికెటర్లు అక్కడ పనిచేస్తూ పైకొచ్చినవాళ్లే! ఆ కాలంలో.. భారత్‌లో క్రికెటర్లకు అంతగొప్ప శిక్షణా సంస్థలు ఉండేవి కావు. దాంతో తమ ప్రతిభకు సానపెట్టుకునేందుకు ఇంగ్లండ్‌లోని క్లబ్బుల్లో చేరి.. లీగ్‌లు ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌కి రాచబాట వేసుకునేవారు.
బౌండరీలకు ఆవల ఉన్నవాళ్లను ఆహ్వానించి క్లబ్బుల్లో చేర్పించేవాడు సోలీ. జపిన్ పరంజపే, ప్రణబ్రాయ్, వినోద్ కాంబ్లీ, సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రోహన్ గవాస్కర్.. ఇలా ఎంతోమంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలు సృష్టించేందుకు మెరుగులుదిద్దాడు. సోలీ అండదండలతోనే ఇంగ్లండ్‌లో ఆడి, ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టామని ఇండియా, పాకిస్థాన్ క్రీడాకారులెందరో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొన్నారు కూడా.
సోలీ ఇల్లు ఎప్పుడూ క్రికెటర్లతో కళకళలాడుతూ ఉండేది. భారత్, పాకిస్థాన్ క్రీడాకారులకు ఆ ఇల్లే షెల్టర్ జోన్. ఏ అర్ధరాత్రి వచ్చినా క్రికెట్ క్రీడాకారుల కోసం డ్యూస్బరీలోని సోలీ ఇంటి తలుపులు తెరిచే ఉండేవి. ఊరు, పేరు తెలియకపోయినా.. క్రికెట్ ఆటగాడినంటే ఆశ్రయమిచ్చేవాడు. అన్నం పెట్టేవాడు. ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్బుల్లో ఆడేందుకు ఆహ్వానించిన క్రీడాకారుల్ని వదిలేయకుండా తన ఇంట్లోనే పెట్టుకునేవాడు. అలా.. ఎప్పుడూ 16 నుంచి 18 మంది క్రికెటర్లు సోలీ ఇళ్లలో ఉండేవాళ్లు. సునీల్ గవాస్కర్‌కి ఆ ఇంట్లో ప్రత్యేకమైన గది ఉండేది.
గవాస్కర్ ఆ గదిలో పడుకుంటే.. పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ హాలులోని సోఫాలో నిద్రించేవాడు. దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లి.. ఆయన ఇంట్లో నెలల తరబడి ఉన్నవారే! మదన్‌లాల్, అజహరుద్దీన్, అబే కురువిల్ల, సురేశ్ శెట్టి, జాన్ హుడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇలా చెప్పుకొంటూ పోతే.. 300 మందికిపైగా అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు ఆ ఇంట ఆతిథ్యం అందుకున్నవాళ్లే! ఆశ్రయం పొందినవాళ్లే! ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు జరిగిన రోజుల్లో ఇండియన్ టీమ్ మొత్తం సోలీ ఇంట్లోనే డిన్నర్ చేసిన సందర్భాలు అనేకం! ఒక్కమాటలో చెప్పాలంటే.. భారతీయ క్రికెటర్లలో ఆ ఇంటి గడప తొక్కనివారు లేరంటే అతిశయోక్తికాదు.
వ్యాపారం, క్రికెట్ రంగాల్లో తనదైన ముద్రవేసిన సోలీ ఆడమ్ పాపులారిటీ బకింగ్‌హామ్ ప్యాలెస్ దాకా పాకింది. అది బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా ఇచ్చే గార్డెన్ టీ పార్టీకి ఆయనను నడిపించింది. రాచప్రాసాదం ఏటా వివిధ రంగాల ప్రముఖులకు టీ పార్టీ ఇస్తుంది. రాణి నుంచి ఆహ్వానం అందుకోవడం గొప్ప సత్కారంగా భావిస్తారు.
సచిన్ తెందూల్కర్ ఇండియాలో రంజీ క్రికెట్ ఆడుతున్న రోజులవి. ఒకనాడు అతనికి సోలీ నుంచి పిలుపు అందింది. యార్క్‌షైర్ కౌంటీలో ఆడించే అవకాశం ఉన్నదన్నది ఆ ఆహ్వాన సారాంశం. 130 ఏళ్ల యార్క్‌షైర్ కౌంటీ చరిత్రలో.. ఆటగాళ్లంతా ఆ ప్రాంతం వాళ్లే! బ్రిటిషర్లకు తప్ప మరొకరికి అవకాశం ఉండేది కాదు. కానీ, ఆ రోజు సోలీ ఆడమ్ మాటే చెల్లింది. సచిన్ తెందూల్కర్ ఆ కౌంటీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఇదో మలుపు. ఆనాటి పత్రికలు ‘ద మ్యాన్ బిహైండ్ రిక్రూటింగ్ సచిన్’ అంటూ సోలీని పొగిడేస్తూ వార్తలు ప్రచురించాయి. ఆ కౌంటీలో ఆడుతూనే.. సచిన్ తనను తాను తీర్చిదిద్దుకున్నాడు.
మధ్యతరగతి కుబుంబానికి చెందిన యువ సచిన్‌కు.. తనింట్లోనే ఆశ్రయం ఇచ్చాడు సోలీ. అప్పటికి సచిన్‌కి వాషింగ్‌మెషిన్ వాడటం కూడా రాదు. ఒకనాడు సోలీ ఇంటికి ఫోన్ చేస్తే.. ఆయన భార్య మరియం ఎత్తింది. ‘వాషింగ్ మెషిన్ ఎలా వాడాలి?’ అని సచిన్ అడిగితే.. ‘సర్ఫ్ వేసి, దుస్తులు వేసి, నీళ్లు పోసి, మూత పెట్టి, స్విచ్ ఆన్ చేయి’ అని ఆమె చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశాడు సచిన్. కాసేపటికి మళ్లీ సోలీ ఇంటికి ఫోన్ చేశాడు. మళ్లీ ఆమే ఎత్తింది. ‘వాషింగ్ మెషిన్ లోంచి విపరీతంగా నురుగ వస్తోంది. గదంతా అడుగులోతు పరుచుకొని పోయింది. ఇల్లు నిండిపోయేలా ఉంది.
ఏం చేయాలి?’ అని భయపడుతూ అడిగాడట. ‘నువ్వేం చేశావు?’ అని ఆమె అడిగితే.. ‘మీరు చెప్పినట్టే చేశా!’ అని చెప్పాడట సచిన్. ‘సర్ఫ్ ఎంత వేశావ్?’ అని మరియం అడిగితే.. ‘ప్యాకెట్ మొత్తం!’ అని సచిన్ సమాధానం. దాంతో ఆమెకు సమస్య అర్థమైంది. వెంటనే అక్కడికి వెళ్లి, ఇల్లు శుభ్రం చేసింది. టీనేజీ కుర్రాడైన సచిన్‌ను తమ ఇంటికి తీసుకువెళ్లి.. తమతోనే ఉండని చెప్పింది. తన దుస్తులు ఉతికి, అమ్మలా అన్నం పెట్టింది. సచిన్ ఆత్మకథలోనూ.. ‘యార్క్‌షైర్ కౌంటీలో ఆడటం నా కెరీర్లోనే టర్నింగ్ పాయింట్. సోలీ ఆడమ్ సహాయం లేకపోతే క్రికెట్లో ఇంత వేగంగా ఎదిగేవాడినే కాదు’ అని రాసుకున్నాడు. ‘క్రికెటర్ల కోసం దేవుడు పంపిన మనిషి.. సోలీ ఆడమ్’ అంటూ చెప్పేవాడు సచిన్.
ఆటకు దారి చూపిస్తాడు. ఆటగాడికి మెలకువలు నేర్పిస్తాడు. కావాలంటే ఆర్థిక సహాయం చేస్తాడు. ఆయన సహకారంతో మూడు వందల మందికిపైగా క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 1975 నుంచి 1990ల మధ్య కాలంలో భారత క్రికెట్‌కి ప్రాతినిధ్యం వహించిన ఏ జట్టులో చూసినా.. కనీసం తొమ్మిది మంది క్రీడాకారులు సోలీ ఇంట ఆశ్రయం పొందినవాళ్లో, సోలీ క్లబ్ క్రికెట్ ఆడించినవాళ్లో, సోలీ సహాయం పొందినవాళ్లో కావడం విశేషం. ఎవరికి ఏ కాంట్రాక్ట్ కావాలన్నా సోలీని కాంటాక్ట్ కావాలని అనుకునేవాళ్లు. ఆటగాడి ఉత్సాహం, ఆడమ్ ప్రోత్సాహం ఒక విజయవంతమైన ఫార్ములాగా ఇంగ్లండ్ క్రికెట్ కౌంటీలో ప్రచారం పొందింది.
తన జీవితంలో రెండు దశాబ్దాల (1975-95) కాలాన్ని ‘గోల్డ్నె డేస్’ అని చెబుతాడు సోలీ ఆడమ్ భాయ్. ఆ రోజుల్లో తన ఇల్లు నిరంతరం క్రికెటర్లతో కళకళలాడుతూ ఉండేది. అప్పట్లో క్రికెట్లో డబ్బు ఇంతగా లేదు. కాబట్టి క్రికెట్‌ని గొప్పగా ప్రేమించేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. క్రికెటర్ బతకడం చాలాకష్టంగా ఉండేది. తిండి కోసం క్రికెట్ ఆడినవాళ్లూ ఉన్నారు. పేదరికంలో ఉన్న క్రీడాకారుల్ని, జీవన పోరాటంలో కష్టనష్టాల్లో ఉన్న క్రీడాకారుల్ని ఆదుకునేందుకు సోలీ ఆడమ్ ఎంతో కృషి చేశాడు. బెనిఫిట్ మ్యాచ్‌ల పేరుతో పేద క్రికెటర్లను ఆదుకునే ప్రయత్నాలెన్నో చేశాడు. క్రీడాకారుల కోసం 70 బెనిఫిట్ మ్యాచ్‌లు నిర్వహించాడు.
సోలీ ఆడమ్ 2001 సంవత్సరంలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ సందర్భంలో క్లబ్ క్రికెట్లో ఆయన సాధించ లేనిది ఏదీ లేదని కొనియాడుతూ బ్రిటన్ పత్రికలు కథనాలు రాశాయి. కానీ, సాధించాల్సింది ఇంకా ఉందని ఆయన ‘సోలీ స్పోర్ట్స్’ ప్రారంభించాడు. తన వ్యాపార సంస్థలన్నిటినీ పిల్లలకు ఇచ్చి, ‘స్పోర్ట్స్ బిజినెస్’ చూసుకుంటున్నాడు. క్రికెటర్లకు, క్రికెట్ పోటీలకు స్పాన్సర్‌గా ఇప్పటికీ ఆటపై తన ప్రేమను చాటుకుంటున్నాడు.
అప్పట్లో కొన్ని క్రికెట్ క్లబ్బుల్లో ఇంగ్లిష్ వాళ్లే ఆడేవాళ్లు. మరికొన్ని క్లబ్బుల్లో ఆసియన్లు ఉండేవాళ్లు. ఇంగ్లిష్, ఆసియా క్రికెట్ క్లబ్‌ల మధ్య స్నేహ సంబంధాలు పెంచడం కోసం సోలీ ప్రయోగాలు చేశాడు. జాతి, ప్రాంత, మత భేదాలు లేకుండా ప్రతిభావంతులైన క్రీడాకారులు అన్ని చోట్లా అడుగుపెట్టేలా ప్రోత్సహించాడు. క్రీడల్లో సామాజిక దూరం పాటించకుండా సమావేశాలు, క్రికెట్ పోటీలు నిర్వహించేవాడు. పేద క్రికెటర్లకు అండగా నిలబడ్డాడు. వారిని ఆదరించాడు. క్రికెట్ అభివృద్ధికి ఆయన కృషిని గుర్తించిన ఇంగ్లండ్ ప్రభుత్వం డ్యూబరీ ప్రాంతంలోని ఓ పార్క్‌లో ఆయన విగ్రహం ప్రతిష్ఠించాలని భావించింది. ఆ ప్రతిపాదనను సోలీ ఆడమ్ తిరస్కరించాడు.
సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ఫ్లయింగ్ విత్ మై వే’లో సోలీ ఆడమ్ గురించి చదివాను. నేనుండే బ్రాడ్ఫోర్డ్ పక్కనే డ్యూస్‌బరీ ఉంది. ఈ రెండూళ్ల మధ్య దూరం 15 కిలోమీటర్లే. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాను. తర్వాత తన స్టోర్‌కి వెళ్లాను. ఆయన చాలామంది క్రికెటర్లు గురించి చెప్పేవాడు. ఆశ్చర్యంగా వినేవాణ్ని. తను పాకిస్థానీ అనుకున్నా. కానీ, ఓ సందర్భంలో తనది గుజరాత్ అని చెప్పాడు. ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఎలా వచ్చాడో చెప్పాడు. ఆ ప్రయాణం వింటే అంతకుముందు విన్న క్రికెటర్లతో సాన్నిహిత్యం కంటే ఇదే గొప్పగా అనిపించింది.
అతని వలస జీవనం, క్రికెట్ మీద ప్రేమ తెలిశాక.. తన జీవితం పుస్తకంగా వస్తే సమాజానికి స్ఫూర్తినిస్తుందని చెప్పాను. తన కథ నన్నే రాయమన్నాడు. రెండేళ్లకుపైగా తనతో మాట్లాడుతూ, తనతో పరిచయమున్న క్రీడాకారులు వివరాలు సేకరిస్తూ పుస్తక రచన చేశాను. ఈ పనుల్లో నా భార్య అరుణ సహకారం ఉంది నా క్లాస్మేట్ సత్యనారాయణ ఫొటోలు, ఇంటర్నెట్లో సమాచారం సేకరించాడు. నేను రాస్తున్న సోలీ చరిత్రను ఎప్పటికప్పుడు మిత్రుడు కోటేశ్ దేవులపల్లితో చర్చిస్తూ, సవరిస్తూ 400 పేజీల ‘సోలీ ఆడమ్.. బియాండ్ బౌండరీస్’ పూర్తి చేశాను.
– వర వంటపాటి
– నాగవర్ధన్ రాయల