దుబాయ్: దాయాది పోరులో భాగంగా టీమ్ఇండియా చేతిలో చావుదెబ్బ తిని టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ ఓటమిపై అక్కడి మీడియా వింత వాదనలు చేస్తోంది. భారత్.. 22 మంది పూజారులను తీసుకొచ్చి తమ జట్టుపై చేతబడి ప్రయోగించి గెలిచిందని వాదించింది. ఓ టీవీ (డిస్కవర్ పాకిస్థాన్) చర్చలో పాల్గొన్న పలువురు వక్తలలో ఒకరు మాట్లాడుతూ.. ‘భారత్ 22 మంది హిందూ పూజారులను దుబాయ్‌కు పంపి పాక్ ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా చేతబడి చేయించింది’ అని అన్నాడు. మరో వక్త మాట్లాడుతూ ‘ఈ కారణం (చేతబడి)తోనే భారత్.. పాకిస్థాన్‌కు వచ్చి ఆడేందుకు నిరాకరించింది. ఎందుకంటే మనం ఇక్కడ పూజారులను అనుమతించం కదా’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.