Vriti Agarwal | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మంగళూరు(కర్నాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగపు పోటీల్లో వ్రితి స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. తొలుత జరిగిన మహిళల 800మీ ఫ్రీస్టయిల్ రేసును వ్రితి 9:16:14 సెకన్ల టైమింగ్తో ముగించి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈతకొలనులో తనకు తిరుగులేదని మరోమారు నిరూపిస్తూ జాతీయ టోర్నీలో పతకాల పంట పండిస్తున్నది. ఇదే విభాగంలో భవ్య సచ్దేవ(ఢిల్లీ), శ్రీచరణి(కర్నాటక) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు 200మీ బటర్ఫ్లై ఈవెంట్లో వ్రితి రజతం దక్కించుకుంది.