కొత్తపల్లి, డిసెంబర్ 23: కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం వేదికగా ఈనెల 25న 72వ రాష్ట్ర స్థాయి పోటీలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రసాద్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశేశంలో ఆయన టోర్నీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17 ఏండ్ల తర్వాత రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, 33 జిల్లాల నుంచి దాదాపు 1200 మంది ప్లేయర్లు, 100 మంది రిఫరీలు, 40 మంది సిబ్బంది పాల్గొనబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో కబడ్డీని ప్రవేశపెట్టగా, ఒలింపిక్ లాంటి మెగాటోర్నీలో కబడ్డీ ప్రధాన క్రీడగా మారే అవకాశముందని అన్నారు.
జిల్లాలో కబడ్డీని ప్రోత్సహించేందుకు టోర్నీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు అమిత్‌కుమార్ మాట్లాడుతూ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మ్యాట్‌పై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ టోర్నీలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.