హనుమకొండ చౌరస్తా, జూలై 24: తెలుగు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని అంతర్జాతీయ ప్లేయర్లు నందగోపాల్ కిదాంబి, జేబీఎస్ విద్యాధర్ అన్నారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించారు. డాక్టర్ రమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులు నందగోపాల్, విద్యాధర్ మాట్లాడారు. మనవాళ్లు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని తెలుగు రాష్ర్టాలకు ఎంతో పేరు తెస్తున్నారని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడల్లో వివిధ జిల్లాల నుంచి 140 మంది క్రీడాకారులు, 20 టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి రమేశ్‌రెడ్డి, ట్రెజరర్ నాగకిషన్, వరంగల్ క్లబ్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.