మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ పోటీలలో స్టార్ టెన్నిస్ ప్లేయర్లు శుభారంభం చేశారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన యానిక్ సిన్నర్ (ఇటలీ), 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జకోవిచ్ (సెర్బియా), స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ రెండో రౌండ్‌కు చేరారు. మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో మొదటి సీడ్ సిన్నర్.. 7-6 (7/2), 7-6 (7/5), 6-1తో నికోలస్ (చిలీ)పై వరుస సెట్లలో గెలుపొందాడు. తొలి రెండు సెట్లలో టైబ్రేక్‌తో గట్టెక్కిన అతడు.. మూడో సెట్లో మాత్రం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండానే మ్యాచ్‌ను ముగించాడు.
మ్యాచ్‌లో అతడు 7 ఏస్‌లు, 24 విన్నర్లు కొట్టాడు. ఏడో సీడ్ జకోవిచ్.. 4-6, 6-3, 6-4, 6-2తో తెలుగు మూలాలున్న అమెరికా ఆటగాడు ఎన్. బసవరెడ్డిని ఓడించాడు. కొత్త కోచ్ ఆండీ ముర్రే మార్గదర్శకత్వంలో బరిలోకి దిగిన జకో.. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాడు. మ్యాచ్‌లో 23 ఏస్‌లు సంధించిన జకో.. 51 విన్నర్లు బాదాడు. మరో మ్యాచ్‌లో అల్కరాజ్.. 6-1, 7-5, 6-1తో శెవ్చెన్కో (కజకిస్థాన్)ను మట్టికరిపించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. గ్రీకు వీరుడు, 11వ సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్కు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. అమెరికా కుర్రాడు మిచెల్సన్.. 7-5, 6-3, 2-6, 6-4తో సిట్సిపస్కు షాకిచ్చాడు.
మహిళల సింగిల్స్‌లో పోలండ్ బామ స్వియాటెక్ 6-3, 6-4తో క్యాథరీనా సినికొవ (చెక్)ను వరుస సెట్లలో చిత్తుచేసింది. స్వియాటెక్ బలమైన సర్వీసుల ముందు క్యాథరీనా నిలువలేకపోయింది. అమెరికా అమ్మాయి గాఫ్.. 6-3, 6-3తో తన దేశానికే చెందిన సోఫియా కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. జెస్సిక పెగుల.. 6-3, 6-0తో మయ జాయింట్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది. మాజీ యూఎస్ చాంపియన్ నవోమి ఒసాకా.. 6-3, 3-6, 6-3తో కరోలినా గ్రేసియా (ఫ్రాన్స్)ను చిత్తు చేయగా విక్టోరియా అజరెంక, జెలినా ఒట్సపెంకొ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు.