ODI World Cup 2023 : మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) టోర్నీకి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. తొడ కండరాల గాయం(Harmstring Injury) నుంచి హసరంగ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో, అతడు ఈ మెగా టోర్నీలో ఆడేది అనుమానమే అని ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ డాక్టర్ అర్జున డిసిల్వా(Arjuna de Silva) వెల్లడించాడు.
‘హసరంగకు సర్జరీ చేయాలా? వద్దా? అనే విషయమై విదేశీ వైద్యులను సంప్రదిస్తున్నాం. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే అతడు కనీసం మూడు నెలల వరకు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే హసరంగా ఇంకా కోలుకోలేదు. ఈ స్టార్ ఆల్రౌండర్ వరల్డ్ కప్ పోటీల్లో బరిలోకి దిగడం కష్టమే’ అని డిసిల్వా చెప్పుకొచ్చాడు.
జింబాబ్వే ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup 2023 Qualifiers)లో హసరంగ ఓ రేంజ్లో చెలరేగాడు. వరుసగా ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను వణికించాడు. దాంతో, లంక అవలీలగా ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించింది. సూపర్ ఫామ్లో ఉన్న అతను భారత్లో జరిగే ప్రపంచ కప్లో శ్రీలంక ప్రధాన ఆయుధం అవుతాడని అనుకున్నారంతా.
తొడ కండరాల నొప్పితో విలవిలలాడుతున్న హసరంగ
కానీ, నెలక్రితం సొంత గడ్డపై జరిగిన లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League 2023)లో హసరంగ గాయపడ్డాడు. తొడ కండరాల నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. దాంతో, ఆ తర్వాత జరిగిన ఆసియా కప్(Asia Cup 2023)లో ఆడలేదు. బ్యాటుతో, బంతితో రాణించే హసరంగ జట్టులో లేకపోవడంతో లంకకు పెద్ద లోటే. ప్రపంచ కప్ పోటీలు అక్టోబర్ 5న మొదలవ్వనున్నాయి. శ్రీలంక జట్టు అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.