Srilanka | కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్పిన్‌కు సహకరిస్తున్న కొలంబో పిచ్‌పై అద్భుత బౌలింగ్‌తో తొలి వన్డేను డ్రా చేసుకున్న లంకేయులు.. రెండో వన్డేలోనూ అదే వ్యూహంతో టీమ్ఇండియాను దెబ్బకొట్టారు. ఆ జట్టు స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జెఫ్రీ వాండర్సే (6/33) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. లంక నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ఇండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే చేతులెత్తేసి 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
రోహిత్ శర్మ (44 బంతుల్లో 64, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి చెలరేగినా అక్షర్ పటేల్ (44) ఆదుకునే యత్నం చేసినా వాండర్సే, అసలంక (3/20) స్పిన్ మాయాజాలంతో ఆతిథ్య జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (40), కమిందు మెండిస్ (40) రాణించారు. ఈ సిరీస్‌లో చివరి వన్డే బుధవారం జరుగనుంది. రెండో వన్డేలో ఓటమితో 1997 నుంచి లంక గడ్డపై వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచిన భారత జైత్రయాత్రకు తెరపడింది.
మోస్తరు ఛేదనను రోహిత్ సేన ధాటిగానే ఆరంభించింది. హిట్‌మ్యాన్, గిల్ (35) తొలి వికెట్‌కు 13 ఓవర్లలో 95 పరుగులు జోడించి శుభారంభాన్నే అందించారు. కానీ తన రెండో ఓవర్లో వాండర్సే.. రోహిత్‌ను బోల్తొ కొట్టించడంతో వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. 17వ ఓవర్లో అతడు గిల్‌తో పాటు దూబెను ఔట్ చేయగా 19వ ఓవర్లో కోహ్లీ (14) కూడా వికెట్ల ముందు దొరికిపోవడంతో పర్యాటక జట్టు కష్టాలు రెట్టింపయ్యాయి. అదే క్రమంలో శ్రేయస్ అయ్యర్ (7), కెఎల్ రాహుల్ (0)ను ఔట్ చేసిన వాండర్సే భారత్‌ను కోలుకోనీయకుండా చేశాడు.
ఈ క్రమంలో అక్షర్ ఆదుకునే యత్నం చేసినా అసలంక వేసిన 34వ ఓవర్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో అతడూ ఔటయ్యాడు. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న వాషింగ్టన్ సుందర్ (15)నూ అసలంక పెవిలియన్‌కు పంపడంతో భారత ఓటమి ఖరారైంది. ఒక దశలో 96/0గా ఉన్న భారత్.. వాండర్సే ధాటికి పది ఓవర్ల వ్యవధిలో 50 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లు నష్టపోగా అవన్నీ అతడి ఖాతాలోకే వెళ్లడం గమనార్హం.
3 భారత్‌పై వన్డేలలో ఆడుతూ ఓ లంక స్పిన్నర్‌కు ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన. మురళీధరన్ (7/30), అజంతా మెండిస్ (6/13) వాండర్సే కంటే ముందున్నారు.