SL vs NPL : పొట్టి ప్రపంచ కప్లో బోణీ కొట్టాలనే కసితో ఉన్న మాజీ చాంపియన్ శ్రీలంక (Srilanka)కు వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. టాస్ పడకుండానే బుధవారం నేపాల్(Nepal)తో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో గెలుపు బాట పట్టాలనుకున్న లంక ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్ ‘డి’ నుంచి దక్షిణాఫ్రికా(South Africa) సూపర్ 8కు అర్హత సాధించింది. తద్వారా మెగా టోర్నీలో ఈ దశకు చేరుకున్న తొలి జట్టుగా ఎడెన్ మర్క్రమ్ సేన నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ 23వ మ్యాచ్లో శ్రీలంక, నేపాల్ ఫ్లోరిడా వేదికగా అమీతుమీకి సిద్దమయ్యాయి. అయితే.. టాస్కు ముందే అక్కడి లాడెర్హిల్ స్టేడియంలో వాన మొదలైంది. చినుకులు తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా పెట్టాలని అనుకున్నారు. కానీ, అది కూడా సాధ్యం కాలేదు.
The Group D encounter between Sri Lanka and Nepal has been abandoned 🌧#SLvNEP #T20WorldCuphttps://t.co/oGRJDr3yje
— ICC (@ICC) June 12, 2024
దాంతో, టాస్ కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దాంతో, శ్రీలంక, నేపాల్ జట్లకు చెరొక పాయింట్ వచ్చింది. ప్రస్తుతం లంక ఒకే ఒక పాయింట్లో అట్టడుగున నిలవగా.. ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న దక్షిణాఫ్రికా సూపర్ 8కు క్వాలిఫై అయింది.