QCEC 2025 | ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC)–2025లో విజేతలలో ఒకరిగా నిలిచి తెలుగు సమాజానికి గర్వకారణంగా మారింది ఆచంట లక్ష్మీ మనోజ్ఞ. చిన్న వయసులోనే వసుధైవ కుటుంబకమ్” అనే సార్వకాలిక–సార్వజనీన దృక్పథాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, వలసవాద ధోరణులను ప్రశ్నించే సాహిత్య దృష్టిని ఆవిష్కరించడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
సింగపూర్‌లోని Crescent Girls’ Schoolలో సెకండరీ–2 చదువుతున్న మనోజ్ఞ.. చదువుతో పాటు సంగీతం, సాహిత్యం, పియానో, నృత్యం వంటి అనేక రంగాల్లో తన ప్రజ్ఞను వికసింపజేస్తోంది. ఈ ఏడాది Royal Commonwealth Society ఆధ్వర్యంలో నిర్వహించిన, పాఠశాల విద్యార్థుల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీలలో ఒకటైన QCECలో ఆమె రన్నరప్‌గా ఎంపిక కావడం విశేషం. మనోజ్ఞ తన కవిత్వం ద్వారా విశ్వమానవాళి అనుభూతులతో తాదాత్మ్యాన్ని ఏర్పరుచుకుంటుంది.
మనోజ్ఞ బహుమతి గెలుచుకున్న కవిత పేరు ‘ఇండియా టు మారిషస్’. భారతదేశంలోని తన ఇంటి నుంచి తల్లికి దూరమై మారిషస్‌లోని ఒక ఎన్‌క్లోజర్‌కు తరలించబడిన పసి కోతి కథను ప్రతీకాత్మకంగా చెబుతుంది. భారతదేశం–మారిషస్‌లను కలిపే బానిస కార్మిక వ్యాపారం, ఆ మార్గంలో జరిగిన మానవ–అమానవ వలసల చరిత్రపై ఆమె చేసిన పరిశోధన ఈ కవితకు బలమైన భూమికైంది. కార్మికులతో పాటు వన్యజీవులనూ వలస వ్యాపారంలోకి నెట్టిన దారుణ వాస్తవం తెలుసుకుని కలిగిన వేదనే ఈ రచనకు ప్రేరణగా మారింది. కవితలో, తల్లి చెంత లభించే ఆత్మీయ వాతావరణాన్ని హఠాత్తుగా కోల్పోయి పరాయి చోట బందీయై పడే బాధలు, తిరిగి తల్లి ప్రేమ కోసం తపించే పసికోతి ఆర్తనాదం హృదయవిదారకంగా ఆవిష్కృతమవుతుంది. బందిఖానాలోని స్వానుభవాలు, గతంలోని తీపి జ్ఞాపకాలు–ప్రస్తుత వేదన మధ్య సాగే సంఘర్షణ ప్రతి హృదయాన్ని తాకేలా వర్ణించబడింది.

Qcec2025
భారతదేశంలో జన్మించి ఆరు నెలల వయసులో సింగపూర్‌కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకున్న కుటుంబానికి చెందిన మనోజ్ఞ, QCEC ఇతివృత్తమైన ‘Our Commonwealth Journey’కి అనుసంధానంగా భారతదేశం గురించి రాయాలని నిర్ణయించుకుంది. ఇండియా నుంచి సింగపూర్‌కు వచ్చి తమ కుటుంబానికి నూతన జీవితం నిర్మించుకున్న తీరుతెన్నుల్ని తల్లిదండ్రులు చెప్పిన సంగతులే ఈ కవితకు స్ఫూర్తినిచ్చాయని ఆమె పేర్కొంటుంది. ఆమె కవితా ధోరణిలో ఎలిజబెత్ లిమ్, ఆన్ లియాంగ్ వంటి రచయితల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రదానోత్సవం లండన్‌లోని St James’s Palaceలో వైభవంగా జరిగింది. తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో, ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ Queen Camilla చేతుల మీదుగా స్వీకరించింది. తెలుగు బాలిక ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై లభించిన ఈ గౌరవం, మన భాష–సాహిత్యాలకు మరో మైలురాయిగా నిలిచింది.