హైదరాబాద్, ఆట ప్రతినిధి : అహ్మదాబాద్‌లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో రాష్ర్టానికి చెందిన శ్రీ నిత్య పసిడి పతకం గెలుచుకోగా శివాని కాంస్యం నెగ్గింది. మహిళల గ్రూప్-1 200 మీటర్స్ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో శ్రీ నిత్య.. 2:21.56 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణాన్ని ముద్దాడింది.
కర్నాటకకు చెందిన నైషా , తమిళనాడు స్విమ్మర్ ప్రమితి వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. మహిళల గ్రూప్-2 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని.. 2:30.34 నిమిషాల్లో లక్ష్యం చేరి కాంస్యం సాధించింది. ఈ విభాగంలో అన్వి (మహారాష్ట్ర) స్వర్ణం, ఒవియ (తమిళనాడు) రజతం గెలిచారు.