Sri Lanka | గాలె: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గాలె వేదికగా జరిగిన రెండో టెస్టులో లంకేయులు కివీస్‌పై ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 15 ఏండ్ల తర్వాత న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం విశేషం. ఆట నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 199/5వ వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టిమ్ సౌథీ సేన.. 81.4 ఓవర్లలో 360 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ (88 ఆలౌట్)తో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఆడినా పర్యాటక జట్టుకు పరాభవం తప్పలేదు. లంక ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడిచినా, స్టంప్ అవుట్స్ నుంచి తప్పించుకున్నా న్యూజిలాండ్ బ్యాటర్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్ (78), మిచెల్ సాంట్నర్ (67), టామ్ బ్లండెల్ (60) ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించడానికి పోరాడారు.
లంక బౌలర్లలో తొలి టెస్టు ఆడిన నిషాన్ పీరిస్ (6/170) రాణించగా లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (3/139) లోయరార్డర్ పనిపట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులు చేసిన కమిందు మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రాగా సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టిన జయసూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో లంక మూడో స్థానం (55.56 శాతం) లోకి దూసుకొచ్చింది. ఈ జాబితాలో భారత్ (71.67), ఆస్ట్రేలియా (62.5) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.