కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సహ ఆతిథ్య దేశంగా ఉన్న కొలంబోలో శ్రీలంక జట్టు ఆడిన ఆఖరి మ్యాచ్ సైతం వర్షార్పణమైంది. టోర్నీ ప్రారంభం నుంచీ కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌లకు ఆటంకం కల్గిస్తున్న వరుణుడు.. లంక, పాకిస్థాన్ మ్యాచ్‌నూ సాగనీయలేదు. వర్షం కారణంగా సుమారు మూడు గంటల పాటు ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో లంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు కూడా పూర్తికాకముందే వరుణుడు మళ్లీ ఆటకు అంతరాయం కల్గించాడు.
రెండోసారి వర్షం తీవ్రత ఎక్కువ ఉండటంతో నిర్వాహకులు మ్యాచ్‌ను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కొలంబోలో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే అర్ధాంతరంగా ముగిసింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఒక్క విజయమూ లేకుండా ప్రపంచకప్‌ను ముగించడం గమనార్హం. ఆ జట్టు 7 మ్యాచ్‌లు ఆడగా నాలుగింట్లో ఓడి మూడింట్లో ఫలితం తేలలేదు. ఇక ఈ మ్యాచ్‌తో శ్రీలంకలోనూ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్‌లతో పాటు రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతాయి.