లక్నో: వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న లంకేయులు..శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. నెదర్లాండ్స్ నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని లంక 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్యన్ దత్(3/44) ధాటికి 52 పరుగులకే కుశాల్ పెరెరా(5), కెప్టెన్ కుశాల్ మెండిస్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో పతున్ నిస్సంక(54), సదీరా సమరవిక్రమ(107 బంతుల్లో 91 నాటౌట్, 7ఫోర్లు) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు కలిసి డచ్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా పాక్‌పై సెంచరీతో ఆకట్టుకున్న సమరవిక్రమ..సాధికారిక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. 54 పరుగుల వద్ద నిస్సంక ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 52 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌నకు బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక(44), ధనంజయ డిసిల్వా(30)తో కలిసి సమరవిక్రమ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. వాన్ మీకర్న్, అకెర్మన్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో సైబ్రాండ్(70), లోగాన్ వాన్‌బీక్(59) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. మదుశనక(4/49), రజిత(4/50) నాలుగేసి వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
నెదర్లాండ్స్: 49.4 ఓవర్లలో 262 ఆలౌట్(సైబ్రాండ్ 70, వాన్‌బీక్ 59, మదుశనక 4/49, రజిత 4/50), శ్రీలంక: 48.2 ఓవర్లలో 263/5(సమరవిక్రమ 91 నాటౌట్, నిస్సనక 54, దత్ 3/44, మీకెర్న్ 1/39)