హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సాట్స్ ఆధ్వర్యంలో మంగళవారం చలో మైదాన్ కార్యక్రమం ఘనంగా జరుగబోతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ క్రీడాదినోత్సవాన్ని రాష్ట్రంలో ఉత్సహభరిత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. ఎల్బీ ఇండోర్ స్టేడియం ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉన్న 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, 75 నియోజకవర్గ స్టేడియాలు, 33 జిల్లా కేంద్రాల్లో ఉన్న మైదానాలు, ప్లేయర్లు, యువతతో కళకళలాడే విధంగా సాట్స్ సన్నాహాలు చేస్తున్నది.
15 నుంచి 36 ఏండ్ల వయసు కల్గిన యువతను లక్ష్యంగా వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో ఆటల ద్వారా ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అన్న సందేశాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో కార్యక్రమ రూపకల్పన చేశాం. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు’ అని అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సాట్స్ చైర్మన్ తెలిపారు.