హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మరింత మెరుగువ్వాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. ఇందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని, పతకాలు సాధించే ప్రాంగణాలుగా అకాడమీలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. వరుసగా రెండో రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన సమీక్షా సమావేశంలో క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచనలు అనుసరిస్తూ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మెరుగుదలకు పారదర్శక విధానాలతో ముందుకు వెళ్లాలని ఆయన అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలి. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మూసధోరణి వీడి, నూతన దృక్పథాన్ని అలవర్చుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ విధానాలను అలవర్చుకోవాలి’ అని అన్నారు. ఈ సమీక్షలో సాట్స్ అధికారులు, డీవైఎస్‌వోలు పాల్గొన్నారు.