నాగపూర్: సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్ ఆసాంతం తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్‌దూబే కొత్త చరిత్ర లిఖించాడు. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు(69) తీసిన బౌలర్‌గా దూబే అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2018-19 సీజలో బీహార్‌కు చెందిన అషుతోశ్ అమన్(68) నెలకొల్పిన రికార్డును దూబే తాజాగా బద్దలు కొట్టాడు.
తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో దూబే వికెట్ల పండుగ చేసుకున్నాడు. పిచ్ ఏదైనా తన స్పిన్ తంత్రంతో బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేస్తూ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఓవర్‌నైట్ స్కోరు 131/3 తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కేరళ 342 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ బ్యాటర్లు కెప్టెన్ సచిన్ బేబి(98), ఆదిత్య సర్వతె(79) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.
విదర్భ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓవైపు వికెట్లు పడుతున్నా..సచిన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నిదీశ్(1)ను ఔట్ చేయడం ద్వారా దూబే(3/88) నయా రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మరో రెండు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో విదర్భ 37 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది.