ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 19, 2020 , 00:45:11

జర్మనీకి ఝలక్‌

జర్మనీకి ఝలక్‌

స్పెయిన్‌ చేతిలో ఘోర పరాజయం

సెవిల్లా (స్పెయిన్‌): జర్మనీ ఫుట్‌బాల్‌ జట్టు నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. గతంలో తమకు ఎదురేలేదన్నట్లు విజృంభించిన జర్మనీ.. అనూహ్య ఓటములతో అప్రతిష్ట మూటగట్టుకుంటున్నది. నేషన్స్‌ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ 6-0తో జర్మనీని చిత్తుగా ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత 89 ఏండ్లలో జర్మనీ ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిసారి 1931లో ఆస్ట్రియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో ఈ మాజీ ప్రపంచ చాంపియన్‌ ఇంతే తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ విషయానికొస్తే స్పెయిన్‌ తరఫున ఫెరాన్‌ టోరెస్‌ (33ని, 55ని, 71ని) హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టగా, అల్వరో మొరాట (17ని), మికెల్‌ (89ని) ఒక్కో గోల్‌ చేశారు. జర్మనీ డిఫెన్స్‌ లోపాలను ఎత్తిచూపుతూ స్పెయిన్‌ వరుస గోల్స్‌తో విరుచుకుపడింది. ప్రథమార్ధం ముగిసే సరికి 3-0తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇదిలా ఉంటే 1909లో ఇంగ్లండ్‌ చేతిలో 0-9తో ఓడిపోవడం జర్మనీ చెత్త ప్రదర్శనగా రికార్డుల్లోకెక్కింది.