ముంబై: ఆదివారం నుంచి ఆరంభమైన జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్బీఎల్)లో హైదరాబాద్ హీరోస్ ఫ్రాంచైజీకి స్పెయిన్ సూపర్ స్టార్ మాన్యుయెల్ మోరెనో సారథిగా నియమితుడయ్యాడు. అతడికి తోడుగా భారత ఆటగాడు ప్రిన్స్ ఖత్రి, జర్మనీ ప్లేయర్ మాక్స్ రాడిక్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత అంతర్జాతీయ రగ్బీ లీగ్ అయిన ఆర్బీఎల్లో.. సుమారు 30 దేశాల నుంచి ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
ఆరు ఫ్రాంచైజీలు (బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్, చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, హైదరాబాద్ హీరోస్, కలింగ బ్లాక్ టైగర్స్, ముంబై డ్రీమర్స్) తలపడుతున్న ఈ టోర్నీ ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆతిథ్యమిస్తున్నది. ఇక హైదరాబాద్ జట్టుకు సారథిగా ఎంపికవడంపై మోరెనో స్పందిస్తూ.. ‘సారథిగా నియమితుడవడం పెద్ద బాధ్యత. దానిని నేను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ప్రిన్స్, మాక్స్‌తో కలిసి జట్టును విజేతగా నిలపడమే మా లక్ష్యం’ అని అన్నాడు. కాగా తాము ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్.. 24-14తో కలింగ బ్లాక్ టైగర్స్‌పై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.