Rodrigo Hernandez | పారిస్: ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘బాలన్ డి ఓర్’ను ఈ ఏడాది స్పెయిన్ ఫుట్‌బాలర్ రోడ్రిగొ హెర్నాండెజ్ (రోడ్రి) గెలుచుకున్నాడు. సోమవారం రాత్రి పారిస్‌లోని థియేటర్ డు చాట్లెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రోడ్రి ఈ అవార్డును అందుకున్నాడు. స్పెయిన్ దేశస్తుడైన రోడ్రి.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ ఏడాది మాంచెస్టర్ సిటీ ఈపీఎల్ ట్రోఫీ గెలవడంతో పాటు స్పెయిన్ జట్టు యూరో-2024 కప్ దక్కించుకోవడంలో రోడ్రి కీలకపాత్ర పోషించడంతో అతడికి ఈ అవార్డు దక్కింది. రియల్ మాడ్రిడ్‌కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్, డాని కార్వజల్ నుంచి రోడ్రికి తీవ్ర పోటీ ఎదురైంది. మహిళల విభాగంలో స్పెయిన్‌కే చెందిన ఐటానా బొన్మాటీ బాలన్ డి ఓర్‌ను గెలుచుకుంది. స్పెయిన్ యువ సంచలనం లమినె యమాల్‌కు ఉత్తమ యువ ఫుట్‌బాలర్ అవార్డు లభించింది.