కెయిర్న్స్(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో సఫారీలు 98 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/33) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో కంగారూలు కుప్పకూలారు.
కెప్టెన్ మిచెల్ మార్ష్(88), డ్వారిష్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఛేదనలో 60-0తో మెరుగ్గా కనిపించిన ఆసీస్..మహారాజ్ స్పిన్ ధాటికి 29 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మహారాజ్ విసిరిన స్పిన్ ఉచ్చులో ఆసీస్ చిక్కుకుంది.
అంతకుముందు మార్క్మ్ (82), కెప్టెన్ బవుమా(65), బ్రిట్జె(57) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 296/8 స్కోరు చేసింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ హెడ్(4/57) నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలకమైన మహారాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.