అడిలైడ్: నిలకడలేమితో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆరంభంలో వరుస విజయాలు సాధించి జోరు కనబర్చిన సఫారీ జట్టు.. ఆదివారం మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగుల తేడాతో ఓడి సెమీస్ చేరకుండానే ఇంటిబాటపట్టింది. మొదట నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 రన్స్ చేసింది. కొలిన్ అకెర్మన్ (41), స్టీఫెన్ (37), కూపర్ (35), మ్యాక్స్ డౌడ్ (29) రాణించారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. డికాక్ (13), బవుమా (20), రాసో (25), మార్క్మ్ (17), మిల్లర్ (17), క్లాసెన్ (21) తలా కొన్ని పరుగులు చేసినా.. జట్టును గెలిపించలేకపోయారు. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న నెదర్లాండ్స్.. పోతూ పోతూ దక్షిణాఫ్రికాను తమతో పాటు పట్టుకుపోయింది.