Danam Nagender | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చివరి ఆశ కూడా అడియాశే అయ్యింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఈ నెల 18న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ, దాఖలు చేసిన ఎస్ఎల్పీని భారత అత్యున్నత న్యాయస్థానమైన కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
హైకోర్టు చట్టాన్ని సరిగానే అర్థం చేసుకొని తీర్పునిచ్చిందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది పదో షెడ్యూల్ కింద అనర్హతకు దారితీసే చర్యగా హైకోర్టు నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధంగానే ఉన్నదని, ఇలాంటి కేసుల్లో ఫిరాయింపుదారులకు ఉపశమనం కల్పించలేమని తేల్చిచెప్పింది.
దానం నాగేందర్ ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అనేది సొంతింటికి వెళ్లినట్టు ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దానం నాగేందర్ పార్టీలు మారుతూ, మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడాన్ని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ సమర్థిస్తూ ‘ఘర్ వాపసీ’ అని వ్యాఖ్యానించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆయారాం.. గయారాం.. ఫిర్ ఆయారాం?’ అని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ కాంగ్రెస్ పార్టీ పంచన చేరడాన్ని ఉద్దేశిస్తూ.. ‘వచ్చారు.. వెళ్లారు.. మళ్లీ వచ్చారు’ అని ధర్మాసనం ఎద్దేవా చేసింది. సభ్యుడి చర్యను పార్టీ క్షమించి, అతడిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరిస్తే, గత చర్యకు సంబంధించిన అనర్హత పరిణామం తొలగిపోతుందనే వాదనను కొట్టిపారేసింది. దానం నాగేందర్‌పై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ తప్పుబట్టింది. అసెంబ్లీ పరిధిలో జరిగే అంశాలకే స్పీకర్ పరిమితం కావడం సరికాదన్నది. ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట వ్యవహరించే చర్యల ఆధారంగా పదో షెడ్యూల్ కింద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం చెల్లదని పేర్కొన్నది.
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదిస్తూ.. ఒక పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వ్యక్తి, తిరిగి ఆ పార్టీలో కొనసాగితే దానిని ‘ఘర్ వాపసీ’గా పరిగణించవచ్చన్నారు. పదో షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం పార్టీకి సభ్యుడి చర్యను క్షమించే అవకాశం ఉన్నదని పేరొన్నారు. దానం నాగేందర్‌ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదని, పార్టీ నుంచి బహిషరించలేదని, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేగా కొనసాగించారని చెప్పారు. ఈ వాదనలను బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ చర్యలను క్షమించలేదని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ తరఫున పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి న్యాయపోరాటం చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం రెండూ వేర్వేరు నిబంధనల కిందికి వస్తాయని స్పష్టంచేసింది. పదో షెడ్యూల్లోని 2(1)(బీ) నిబంధన పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించిన అంశాలకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుచేసింది. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంబంధించిన 2(1)(ఏ)కు వర్తించదని స్పస్టంచేసింది. అందుకే దానంకు ‘ఘర్ వాపసీ?’ వర్తించదని తేల్చిచెప్పింది. దానం నాగేందర్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లి, తిరిగి సొంత ఇంటికి వచ్చినట్టుగా వాదిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నిస్తూ, ‘ఆయారాం.. గయారాం.. ఫిర్ ఆయా రాం?’ అని వ్యాఖ్యానించింది.
దానం నాగేందర్ తరఫు న్యాయవాది చేసిన ‘ఘర్ వాపసీ’ వాదనపై జస్టిస్ వీ మోహన్ స్పందిస్తూ.. ‘ఘర్ వాపసీ అనేది పార్టీకి మాత్రమే. అసెంబ్లీకి కాదు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజల తీర్పుతో లభించిన స్థానం ఒక ‘ఫిక్స్డ్ డిపాజిట్’ వంటిదని, మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీచేయడం ద్వారా దాన్ని షేర్ మారెట్ ద్వారా పెంచుకొనే ప్రయత్నం చేశారని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు. 2023లో దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీ వద్ద ఎమ్మెల్యేగా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది. ఎంపీగా షేర్ మారెట్‌కు ప్రయత్నించారు.
ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పోయింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ప్రజామద్దతు ఉన్నదని భావిస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి జరుగనున్న ఉపఎన్నికలో మళ్లీ పోటీచేసి ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని దానం నాగేందర్‌కు స్పష్టం చేసింది. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టాన్ని హైకోర్టు సరిగానే అర్థం చేసుకొన్నదని పేరొంటూ దానం ఎస్ఎల్పీని కొట్టివేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీజే పీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ వాటిని తిరసరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి, స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది. దానం నాగేందర్‌ను 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అని పేరొన్నది. హైకోర్టు ఈ నెల 18న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై రా జ్యాంగంలో ప్రత్యక్ష నిషేధం లేదని ఆయన తరఫు వాదనలో పేరొన్నారు. మరో పార్టీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న ట్టుగా రాజ్యాంగంలో ఆ నిషేధం లేనందున అనర్హత విధించలేమని స్పీకర్ గతంలో పేరొ న్నారని హైకోర్టు ముందుంచగా, ఆ వాదనను తోసిపుచ్చింది. బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతూ, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా ఆయన పదో షెడ్యూల్ లోని 2(1)(ఏ) కింద అనర్హతకు గురయ్యారని హైకోర్టు తీర్పు ఇచ్చింది.