ముంబై: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగలుతూనే ఉన్నాయి. ఎలాగైనా టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్‌కు ఏదీ కలిసిరావడం లేదు. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి మరువక ముందే దక్షిణాఫ్రికా..ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ముంబైలో వార్వన్సైడ్ అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ తేడాతో సఫా చేశారు. క్లాసెన్, హెండ్రిక్స్, జాన్సెన్, డస్సెన్ దంచుడుతో 399 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా..బౌలింగ్‌లోనూ ఇరుగదీస్తూ ఇంగ్లిష్ టీమ్‌ను స్వల్పస్కోరుకు పరిమితం చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది ఘోర ఓటమి.
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరోమారు జూలు విదిల్చింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న సఫారీలు..ఇంగ్లండ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయదుందుభి మోగించింది. తొలుత సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 399/7 భారీ స్కోరు నమోదు చేశారు. క్లాసెన్(67 బంతుల్లో 109, 12ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి తోడు హెండ్రిక్స్ (85), జాన్సెన్(42 బంతుల్లో 75 నాటౌట్, 3ఫోర్లు, 6 సిక్స్‌లు), డస్సెన్(60) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. డికాక్(4) నిరాశపరిచినా..మిగతా బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా క్లాసెన్, జాన్సెన్ జోడీ కండ్లు చెదిరే సిక్స్‌లు, బౌండరీలతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించింది. బంతి పిచ్‌పై పడటం ఆలస్యం..స్టాండ్స్‌లోకి పంపిస్తూ భారీ స్కోరుకు కారణమయ్యారు. పసలేని ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని దునుమాడుతూ వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 బంతుల్లో 151 పరుగులు జతచేశారు. వీరి దూకుడుతో ఆఖరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 143 పరుగులు పిండుకుంది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్..22 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. మార్క్ వుడ్ (43 నాటౌట్), అట్కిన్సన్(35)మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. కోట్జె (3/35), ఎంగ్డీ(2/26) రాణించారు. క్లాసెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 399/7(క్లాసెన్ 109, హెండ్రిక్స్ 85, టోప్లె 3/88, అట్కిన్సన్ 2/60)
ఇంగ్లండ్: 22 ఓవర్లలో 170 ఆలౌట్ (వుడ్ 43 నాటౌట్,కోట్జె 3/35, ఎంగ్డీ 2/26)