IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్ తదుపరి మ్యాచ్‌లు మరో మూడు రోజుల్లో మొదలు కానున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు విదేశీ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ (Cricket Australia) తమ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా బోర్డు సైతం ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు తమ క్రికెటర్లకు అనుమతి ఇవ్వనుంది. అయితే.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కంటే ముందే స్వదేశం రావాలనే షరుతు పెట్టింది సఫారీ బోర్డు. జూన్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2025) ఉండడమే అందుకు కారణం.
‘మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం పాటు టోర్నీ వాయిదా పడడంతో ఫైనల్ తేదీ జూన్ 3కి మారింది. అయితే, ముందస్తు ఒప్పందం ప్రకారం మే 25 వరకే మా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతారు. మే 26న స్వదేశం బయల్దేరుతారు. ఆ తర్వాత 30వ తేదీన లండన్ చేరుకుంటారు. ఇందులో ఏ మార్పు లేదు’ అని దక్షిణాఫ్రికా క్రికెట్, హెడ్‌కోచ్ శుక్రి కొన్రాడ్ (Shukri Conrad) స్పష్టం చేశారు.
ప్రస్తుతం 18వ సీజన్ ఐపీఎల్లో 20 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడుతున్నారు. వీళ్లలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ స్క్వాడ్‌కు ఎంపికయ్యారు. ఈ ఎనిమిది మంది ఫిట్‌గా ఉండడం, మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఆ దేశ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 26న ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్వాడ్‌తో కలవాలని ఆదేశించింది. దాంతో, పలు జట్లకు ఆడుతున్న సఫారీ ప్లేయర్లు మే 25తో ఐపీఎల్‌కు దూరం కానున్నారు.
పద్దెనిమిదో సీజన్ ఆడుతున్న సఫారీ ఆటగాళ్లలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైంది ఎవరంటే.. కార్బిన్ బాస్చ్, రియాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్), వియాన్ మల్డర్(సన్‌రైజర్స్ హైదరాబాద్), మార్కో యాన్సెన్(పంజాబ్ కింగ్స్), ఎడెన్ మర్క్రమ్(లక్నో సూపర్ జెయింట్స్), లుంగి ఎంగిడి(ఆర్సీబీ), కగిసో రబడ(గుజరాత్ టైటాన్స్), ట్రిస్టన్ స్టబ్స్(ఢిల్లీ క్యాపిటల్స్). వీళ్లు కాకుండా డూప్లెసిస్, కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్, కొయెట్జీ, డేవిడ్ మిల్లర్, నంద్రె బర్గర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, క్వెనా మఫాకా.. 18వ సీజన్లో ఆడుతున్న విషయం తెలిసిందే.
Proteas Men’s head coach Shukri Conrad has today announced the 15-player squad for the highly anticipated ICC World Test Championship (WTC) Final against Australia, taking place from 11 – 15 June at Lord’s Cricket Ground in London.
Temba Bavuma will lead the side, with the pace… pic.twitter.com/e76WCrd2zl
— Proteas Men (@ProteasMenCSA) May 13, 2025
దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ స్క్వాడ్ : తెంబ బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, కార్బిన్ బాస్చ్, టోనీ డి జోర్జి, ఎడెన్ మర్క్రమ్, వియాన్ మల్డర్, డేన్ పీటర్సన్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కిలే వెర్రెన్నే. మార్కో యాన్సెస్, కేశవ్ మహరాజ్, సెనురన్ ముతుస్వామి, లుంగి ఎంగిడి, కగిసో రబడ.