ఆదిలాబాద్ : మారుమూల ఆదివాసి గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలని సదుద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం బోథ్ మండలం పట్నాపూర్ ( Patnapur ) గ్రామంలో జిల్లా వైద్యశాఖ , నిర్మల్ స్వప్నసూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులను, టాబ్లెట్లను, వాడాలని సూచించారు. అనవసరంగా జ్వరం టాబ్లెట్లు, నొప్పి టాబ్లెట్లను వాడటం వల్ల కిడ్నీ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు సంభవిస్తాయని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి వ్యాధులు వచ్చినా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలని, బాబాలను, మూఢనమ్మకాలను, చెట్ల మందులను వాడడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఆదివాసీలు గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి వాడకం వల్ల సమాజం నష్టపోతుందని అన్నారు.
యువత రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరైన వయస్సు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని సూచించారు. యువత సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని, ప్రస్తుత సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నూతన పద్ధతులపై ప్రజలకు, యువతకు వివరించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన వైద్యులు వైద్య చికిత్సలను అందజేశారు. వైద్య శిబిరంలో బోథ్ మండలం పట్నాపూర్, ఇన్కర్పల్లి, సుర్దాపూర్ మేడిగుడ్ గ్రామ ల నుంచి దాదాపు 250 మంది ఆదివాసి ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు.