టీ20లలో ఒక్క పరుగు తేడాతో గెలవడం దక్షిణాఫ్రికాకు ఇది ఐదోసారి టీ20 ప్రపంచకప్‌లలో రెండోసారి.
కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): సంచలనాలకు వేదికవుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మరో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికాను ‘పసికూన’ నేపాల్ భయపెట్టింది. ఆఖరి బంతికి ఒకే ఒక్క పరుగు తేడాతో ఆ జట్టు ఓటమి పాలవడంతో ఈ టోర్నీలో మరో సంచలనం వెంట్రుకవాసిలో తప్పింది. గ్రూప్-డి లో భాగంగా సెయింట్ విన్సెంట్ వేదికగా దక్షిణాఫ్రికా-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఒక్క పరుగు తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులకే పరిమితమయ్యారు. ఆ జట్టులో రీజా హెండ్రిక్స్ (43) రాణించగా ట్రిస్టన్ స్టబ్స్ (27) ఫర్వాలేదనిపించాడు. నేపాల్ బౌలర్లలో కుశాల్ బుర్టెల్ (4/19), దీపేంద్ర (3/21) దక్షిణాఫ్రికాను కట్టడిచేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్.. 20 ఓవర్లలో 114/7 పరుగుల వద్ద ఆగిపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షంసీ (4/19) సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
స్వల్ప ఛేదనను నేపాల్ ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్ అసిఫ్ షేక్ (42) దూకుడుగా ఆడాడు. కానీ సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఒకే ఓవర్లో ఓపెనర్లు కుశాల్ (13), అసిఫ్‌ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అనిల్ (27) పోరాడటంతో నేపాల్ విజయానికి ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్ వేసిన బార్ట్‌మన్.. 4 బంతుల్లో 6 పరుగులిచ్చినా ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఆఖరి బంతికి పరుగు తీయబోయిన గుల్షన్ ఝా (6) రనౌట్ అవడంతో నేపాల్ ఆశలు ఆవిరవ్వగా దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 115/7 (హెండ్రిక్స్ 43, స్టబ్స్ 27, కుశాల్ 4/19, దీపేంద్ర 3/21)
నేపాల్: 20 ఓవర్లలో 114/7 (అసిఫ్ 42, అనిల్ 27, షంసీ 4/19, మార్క్మ్ 1/8)