రాయ్‌పూర్ : భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో బౌలింగ్ వైఫల్యంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి ఎదుట 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించినా బౌలర్లు తేలిపోవడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఛేదనలో నిలకడగా ఆడిన ఆ జట్టు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మార్క్మ్ (98 బంతుల్లో 110, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ బ్రీట్జ్కే (64 బంతుల్లో 68, 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54, 1 ఫోర్, 5 సిక్స్‌లు) రాణించడంతో లక్ష్యాన్ని మరో నాలుగు బంతులుండగానే పూర్తిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి 358 రన్స్ సాధించింది. విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 102, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ చేయగా రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లో తొలి సెంచరీని నమోదుచేశాడు. కెప్టెన్ రాహుల్ (66*) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే ఈనెల 6న వైజాగ్‌లో జరుగుతుంది.
రికార్డు ఛేదనలో దక్షిణాఫ్రికా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. 25 పరుగుల వద్దే ఆ జట్టు డికాక్ (8) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయినా ఆ తర్వాత నిలకడగా ఆడింది. బవుమా (46), మార్క్మ్ జోడీ రెండో వికెట్‌కు సెంచరీ (101) భాగస్వామ్యం నెలకొల్పి దక్షిణాఫ్రికాను పోటీలోకి తెచ్చింది. ఆది నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మార్క్మ్క్రు బవుమా చక్కని సహకారం అందించడంతో సఫారీల రన్‌రేట్ 6కు తగ్గకుండా సాగింది. కుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధ సెంచరీ పూర్తిచేసిన మార్క్మ్.్ర. అతడే వేసిన 18వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్ వద్ద జైస్వాల్ జారవిడవడంతో బతికిపోయాడు. ఇదే భారత కొంపముంచింది. జడేజా బౌలింగ్‌లో సిక్స్‌తో 90లలోకి వచ్చిన అతడు.. ఫోర్, సింగిల్‌తో వన్డేల్లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. సెంచరీ తర్వాత అతడు రాణా బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ఇచ్చినా మార్క్మ్ స్థానంలో వచ్చిన బ్రెవిస్ దూకుడుగా ఆడాడు. బ్రెవిస్, బ్రీట్జ్కే కలిసి నాలుగో వికెట్‌కు 63 బంతుల్లోనే 92 రన్స్ జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు దాదాపు ఖాయమైంది. కుల్దీప్ 41వ ఓవర్లో బ్రెవిస్, ప్రసిద్ధ్ 44వ ఓవర్లో బ్రీట్జ్కే, 45వ ఓవర్లో యాన్సెన్ (2) ఔట్ అయినా కార్బిన్ బాష్ (29*) ఆ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
భారత్: 50 ఓవర్లలో 358/5 (రుతురాజ్ 105, కోహ్లీ 102, యాన్సెన్ 2/63, బర్గర్ 1/43);
దక్షిణాఫ్రికా: 49.2 ఓవర్లలో 362/6 (మార్క్మ్ 110, బ్రీట్జ్కే 68, అర్ష్‌దీప్ 2/54, ప్రసిద్ధ్ 2/85)
ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్‌శర్మ(14) మరోమారు విఫలం కావడంతో 62 పరుగులకే టీమ్ఇండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో సూపర్ ఫామ్‌మీదున్న విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 102, 7ఫోర్లు, 2సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 105, 12ఫోర్లు, 2సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. వన్డేల్లో తన స్థానంపై వస్తున్న విమర్శలకు కోహ్లీ మరోమారు అద్భుత శతకంతో సమాధానం చెప్పాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.

దేశవాళీ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో రుతురాజ్ తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో తనకు తిరుగులేదని చాటిచెబుతూ కోహ్లీ 53వ సెంచరీతో కోహ్లీ కొత్త చరిత్ర లిఖించాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో జోరు మీద కనిపించిన ఇన్నింగ్స్ రుతురాజ్ నిష్క్రమణతో కుదుపునకు లోనైంది. యాన్సెన్ బౌలింగ్‌లో రుతురాజ్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆఖర్లో కెప్టెన్ రాహుల్(43 బంతుల్లో 66 నాటౌట్, 6ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా 350కి పైగా మార్క్ అందుకుంది.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు గాను భారత జట్టు ధరించబోయే జెర్సీని బుధవారం ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.

నిరుటి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన సారథి, రాబోయే టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న రోహిత్ శర్మతో పాటు భారత యువ ఆటగాడు తిలక్ వర్మ జెర్సీని ఆవిష్కరించారు.