కోల్‌కతా: తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తే లేదని తేల్చి చెప్పాడు. అయితే టీమ్ఇండియాకు కోచ్‌గా అవకాశం వస్తే మాత్రం అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు తెలిపాడు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన పోడ్కాస్ట్లో భాగంగా ‘వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మీరు ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతున్నారా?’ అన్న ప్రశ్నకు దాదా సమాధానమిస్తూ.. ‘లేదు. నాకు ఆసక్తి లేదు’ అని కుండబద్దలు కొట్టేశాడు. ఒకవేళ సీఎం పదవి ఆఫర్ చేసినా తనకు ఇంట్రస్ట్ లేదని తేల్చేశాడు. టీమ్ఇండియా కోచింగ్‌పై స్పందిస్తూ.. ‘వాస్తవానికి నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
2013లో నా కెరీర్ ముగియగానే నేను వివిధ పాత్రలను పోషించాను. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అధ్యక్షుడినయ్యా. ఒకవేళ భవిష్యత్‌లో ఆ అవకాశమొస్తే మాత్రం చూస్తా. నేను ఇంకా 50 లలో (53 ఏండ్లు)నే ఉన్నా. చూద్దాం. ఏం జరుగుతుందో!’ అని అన్నాడు. భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రస్తుతం బాగా పనిచేస్తున్నాడని..
స్వదేశంలో న్యూజిలాండ్‌తో, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఓడినప్పటికీ చాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో కీలకపాత్ర పోషించాడని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆటగాళ్లతో పాటు అతడికీ కీలకమని దాదా వ్యాఖ్యానించాడు. ఇక ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్ దాకా ఆడటం అంత సులభం కాదని దాదా అభిప్రాయపడ్డాడు.