మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ టైటిల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. 2024లో విజేతగా నిలిచినా నిరుడు దారుణ ప్రదర్శనతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఆ జట్టు.. ఈసారి మాత్రం పట్టు విడువలేదు. ఆరంభం నుంచే చాంపియన్ ఆటతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చి టోర్నీలో రెండో టైటిల్‌ను దక్కించుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. అంతిమ పోరులో బంతితో విఫలమైనా బ్యాట్‌తో రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన రికార్డు లక్ష్య ఛేదనలో స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు జార్జియా వోల్ మెరుపులతో ఆ జట్టు.. రెండు బంతులుండగానే ఊదేసింది. ఇక వరుసగా నాలుగుసార్లు ఫైనల్ చేరి ఈసారైనా కప్పు కలను నెరవేర్చుకోవాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాలుగో ‘సారీ’ నిరాశే ఎదురైంది.
వడోదర: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ టైటిల్‌ను మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కైవసం చేసుకుంది. గురువారం వడోదరలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో రెండో టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వరుసగా నాలుగుసార్లు ఫైనల్ చేరిన ఢిల్లీకి ఈసారీ భంగపాటు తప్పలేదు. క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల ఛేదనను బెంగళూరు.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా వోల్ (54 బంతుల్లో 79, 14 ఫోర్లు) రెండో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరుచేసింది. జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57, 8 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా లారా వోల్వార్ట్ (25 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చినెల్లె హెన్రీ (15 బంతుల్లో 35*, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
భారీ లక్ష్యఛేదనలో రెండో ఓవర్లో 9 పరుగుల వద్దే ప్రమాదకర గ్రేస్ హారీస్ (9) వికెట్‌ను కోల్పోయినా బెంగళూరు వెనక్కి తగ్గలేదు. వోల్‌తో కలిసి మంధాన ధనాధన్ ఆటతో రెచ్చిపోయింది. ఇద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీలకు తగ్గకుండా దంచడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 59/1 స్కోరు చేసింది. క్రీజులో కుదురుకున్నాక ఈ ద్వయం ఆ తర్వాత మరింత జోరు పెంచింది. నందని, శ్రీ చరణి వరుస ఓవర్లలో స్మృతి సిక్స్‌లు కొట్టింది. ఇదే క్రమంలో 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో మంధాన అర్ధ శతకాలు పూర్తయ్యాయి. ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాక ఈ జోడీ ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా బాదడంతో బెంగళూరు లక్ష్యానికి చేరువైంది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడీని ఎట్టకేలకు మిన్ను మణి 17వ ఓవర్లో వోల్‌ను ఔట్ చేయడంతో 165 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వోల్ నిష్క్రమించినా అప్పటికే ఆర్సీబీ విజయం ఖాయమైంది. స్వల్ప వ్యవధిలో రిచా ఘోష్ (6), మంధాన నిష్క్రమించినా రాధా (12*), క్లెర్ (7*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
బెంగళూరు ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైంది. లారెన్ బెల్ కట్టడి చేయడం (4-0-19-0)తో ఆ జట్టు 3 ఓవర్లకు 9 రన్స్ మాత్రమే చేయగలిగింది. కానీ ఆ తర్వాతే ఢిల్లీ బ్యాటర్లు బాదుడుకు శ్రీకారం చుట్టారు. షెఫాలీ వర్మ (20) మినహా క్రీజులోకి వచ్చినవారంతా తమవంతు తలో చేయి వేయడంతో డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలోనే క్యాపిటల్స్ భారీ స్కోరు చేయగలిగింది. సయాలి 4వ ఓవర్లో లిజెల్లె లీ (30 బంతుల్లో 37, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదింది. శ్రేయాంక ఓవర్లోనూ ఆమె 4, 4, 6 దంచడంతో ఢిల్లీ స్కోరు వేగం పుంజుకుంది. లీ స్థానంలో వచ్చిన జెమీమా.. బెంగళూరు బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడటంతో 11 ఓవర్లకు ఆ జట్టు స్కోరు వంద పరుగుల మార్కును దాటేసింది. శ్రేయాంక 12వ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టిన ఢిల్లీ సారథికి వోల్వార్ట్ అద్భుత సహకారం అందించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన జెమీమాను క్లెర్క్ 16వ ఓవర్లో పెవిలియన్‌కు పంపింది. ఆఖర్లో హెన్రీ.. నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో అలరించింది.
ఢిల్లీ: 20 ఓవర్లకు 203/4 (జెమీమా 57, లారా 44, అరుంధతి 1/40, సయాలి 1/46);
బెంగళూరు: 19.4 ఓవర్లకు 204/4(స్మృతి 87, వోల్ 79, హెన్రీ 2/34, మణి 1/19)