యాదగిరిగుట్ట, ఆగస్టు 14: యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన 26 అభివృద్ధి పనులతోపాటు 5 టేబుల్ ఎజెండాలను ట్రస్టు బోర్డు అమోదం తెలిపినట్టు ట్రస్టు బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. యాదగిరిగుట్ట ట్రస్టుబోర్డు తొలిసమావేశం ప్రెసిడెన్సియల్ సూట్లో శుక్రవారం నిర్వహించారు.
సమావేశం ఆనంతరం మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ.. ఆమోదించిన ముఖ్య నిర్ణయాలను వెల్లడించారు. కొండపైన పుష్కరిణి వద్ద రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండపం, బాలాలయ ప్రాంతంలో రూ. 9.87 కోట్లతో నిత్యకల్యాణ మండపం, రూ. 3.16 కోట్లతో రాయగిరి వద్ద స్వాగత తోరణం, వేదపాఠశాల, విశ్వవిద్యాలయం, 40 ఎకరాల్లో మాడల్ గోశాల నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
నిత్యాన్నదానంలో ప్రస్తుతం రోజుకు ,1500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నామని.. దీనిని 2,000 పెంచుతున్నట్టు వివరించారు. అన్నప్రసాదాల తయారీ పరికరాలను రూ. 18 లక్షలతో టెండర్ల ద్వారా కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. టీసీఎస్ సహకారంతో ఇన్మర్మేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. విజన్- 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఐఎస్బీ సిబ్బందిని నియామకం, ట్రస్టుబోర్డు సభ్యులతో ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
దేవస్థాన భవన సముదాయాలు, పార్కింగ్ స్థలాల్లో 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్, దేవస్థానం చుట్టూ ప్రధాన కూడళ్లలో గరుడాళ్వార యాద రుషి, శ్రీరామానుజులు, ప్రహ్లాదుడు, ఆంజనేయ స్వామివారి రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రూ. 9 లక్షలతో దేవస్థాన అద్దె గదుల సమీపంలో రెండో కల్యాణకట్ట ఏర్పాటుకు ట్రస్టు బోర్డు సభ్యుడు గుండా మల్లయ్య విరాళం ప్రకటించారన్నారు.
ట్రస్టుబోర్డు సభ్యురాలు కొణిదెల సురేఖ సొంత నిధులతో కొండపైన ఎలక్ట్రానిక్ శంఖు-చక్ర తిరునామాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ట్రస్టుబోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మయాదవ్ ఆర్థిక సహకారంతో విష్ణుపుష్కరిణి చుట్టూ ఈ సోలార్ ఫెన్సింగ్ నిర్మిస్తామన్నారు. వేంచేపు మండపం పక్కన డోనర్ ఎమినిటీ సెంటర్, బస్టాండ్ ఉత్తర భాగంలో పిలిగ్రిమ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ప్రముఖులు వ్యక్తిగతంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రొటోకాల్ దర్శనం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.