పూణె: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో జార్ఖండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో ఇన్నాళ్లూ ఫైనల్ కూడా చేరని ఆ జట్టు.. తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన ఫైనల్లో జార్ఖండ్.. 69 పరుగుల తేడాతో హర్యానాను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (49 బంతుల్లో 101, 6 ఫోర్లు, 10 సిక్సర్లు) ఫైనల్లో మెరుపు శతకంతో కదంతొక్కగా కుశాగ్ర (38 బంతుల్లో 81, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 262 పరుగుల రికార్డు స్కోరు చేసింది.
రెండో వికెట్‌కు ఇషాన్, కుశాగ్ర 14 ఓవర్లకే ఏకంగా 173 పరుగులు జతచేసి జార్ఖండ్‌కు భారీ స్కోరు కట్టబెట్టారు. అనంతరం ఛేదనలో హర్యానా స్కోరుబోర్డుపై ఒక పరుగు చేరకముందే రెండు వికెట్లు కోల్పోయినా తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. యశ్వర్ధన్ (22 బంతుల్లో 53, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), నిషాంత్ (31), సమంత్ (38) పోరాడారు. కానీ ఆ జట్టు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 193 రన్స్‌కు ఆలౌట్ అయింది.
బీసీసీఐ ఆగ్రహానికి గురై జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్.. ఈ టోర్నీలో బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ జార్ఖండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 57.44 సగటుతో 517 రన్స్ చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 2 శతకాలు, 2 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. అతడి సారథ్యంలో జార్ఖండ్.. 11 మ్యాచ్‌లకు గాను 10 గెలిచి తొలిసారి స్మాట్ టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సెలక్టర్లు ఇకనైనా ఇషాన్‌ను కరుణిస్తారా? అన్నది ఆసక్తికరం.