Slapgate Controversy | క్రికెట్ అత్యంత వివాదాస్పదమైన ఘటనల్లో ఒకటైన స్లాప్ గేట్ వీడియో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టారు. ఐపీఎల్ 2008 సీజన్లో బౌలర్ శ్రీశాంత్‌ను సీనియర్ ప్లేయర్ అయిన హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన జరిగిన చాలారోజుల తర్వాత లలిత్ మోదీ ఈ వీడియోను బయటపెట్టారు. ఈ వీడియోను బయటపెట్టడంపై పలువురు మండిపడ్డారు. తాజాగా హర్భజన్ సింగ్ సైతం స్పందించాడు. ‘బాలీవుడ్ ఇన్స్టంట్ పేజీ’లో మాట్లాడుతూ.. 18 సంవత్సరాల నాటి వీడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం తప్పని.. కొందరి స్వార్థపూరిత ఉద్దేశంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
ప్రజలంతా ఈ ఘటనను మరిచిపోయారని.. ఇప్పుడు మళ్లీ వాటిని గుర్తు చేశారని విమర్శించారు. ఆ రోటు జరిగిన ఘటనపై తాను చాలా సిగ్గుపడుతున్నట్లుగా హర్భజన్ గతంలో చాలాసార్లు చెప్పాడు. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టినందుకు చాలా సందర్భాల్లో క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నది. కానీ, లలిత్ మోదీ సోషల్ మీడియాలో 18 ఏళ్ల నాటి వీడియోను విడుదల చేయడంతో మళ్లీ ఆ ఎపిసోడ్ క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దీనిపై హర్భజన్ స్పందిస్తూ.. ‘జరిగిన దానికి నేను బాధపడ్డాను. ఒక తప్పు జరిగింది. దానికి చింతిస్తున్నాము. అవును, ఆ వీడియో వైరల్ అయింది. ఇది దురదృష్టకర సంఘటన. నేను తప్పు చేశానని చాలాసార్లు చెప్పాను. మనుషులు తప్పులు చేస్తారు. నేను కూడా ఒకటి చేశాను. నన్ను క్షమించమని గణేశుడిని ప్రార్థించాను’ అని మాజీ సిన్నర్ చెప్పుకొచ్చాడు.
2008 ఐపీఎల్లో ‘స్లాప్ గేట్’ తర్వాత హర్భజన్‌ను 11 మ్యాచ్‌ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సైతం వీడియోను బయటపెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది అమానవీయం, అనాగరికం, సిగ్గుచేటు. అందరి దృష్టిని ఆకర్షించేందుకు చేసిన చౌకబారు చర్య. మా కుటుంబం, పిల్లలు మళ్లీ బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి మ్యాచ్ రిఫరీ ఫరూక్ ఇంజినీర్ సైతం వీడియో విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియో ఎప్పటికీ బయటకు వస్తుందని తాను ఊహించలేదన్నారు. సీనియర్ క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే సైతం తన అభిప్రాయం వెల్లడించారు. ఆ సమయంలో బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీ ఇమేజ్, ఆటగాళ్ల ఇమేజ్ను దెబ్బతీయకుండా ఉండేందుకు వీడియోను బహిర్గతం చేయలేదన్నారు.