అడిలైడ్: అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో.. ఇండియన్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్(Siraj Vs Head) మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సిరాజ్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన హెడ్‌ను.. ఆ తర్వాత బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు క్రికెటర్లకు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఐసీసీ భావిస్తున్నది.
సోమవారం రోజున ఇద్దరు ప్లేయర్లతో ఐసీసీ అధికారులు ముచ్చటించారు. ఇద్దర్నీ దోషులుగా ఐసీసీ నిర్ణయించింది. గతంలో ఆ ఇద్దరికీ మంచి రికార్డు ఉన్న కారణంగా.. కేవలం వాళ్లకు మ్యాచ్ ఫీజులో కోత లేదా మందలింపు మాత్రమే ఉంటుందని ఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. డే అండ్ నైట్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించిన ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ట్రావెస్ హెడ్ 140 రన్స్ స్కోర్ చేశాడు.
క్లీన్ బౌల్డ్ అయిన సమయంలో సిరాజ్ బౌలింగ్‌ను మెచ్చుకున్నట్లు హెడ్ తెలిపాడు. కానీ సిరాజ్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించాడు. ఔటైన తర్వాత హెడ్ అనుచిత కామెంట్స్ చేశాడని, దాన్ని టీవీల్లోనూ చూడవచ్చు అని సిరాజ్ తెలిపాడు.