జయశంకర్ భూపాలపల్లి, మే 14 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల దందా బహిరంగంగా కొనసాగుతున్నది. ఉద్యోగానికి రూ.3 లక్షల వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్ నుంచి అధికారుల వరకు తలా ఇంత ముట్టజెప్పాల్సి ఉంటుందని దళారులు బాహాటంగా చెప్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. కొంతకాలంగా ఈ ప్రైవేట్ దోపిడీ జరుగుతున్నా ఈ మధ్య మరీ ఎక్కువైంది.
అప్పటికంటే ఇప్పుడు రేటు పెంచేశారు. దళారులే నేరుగా మంత్రులు, సింగరేణి ఉన్నతాధికారుల నుంచి లెటర్ ప్యాడ్లు తీసుకొచ్చి పైరవీలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల (ఔట్సోర్సింగ్) చర్చే వినిపిస్తున్నది. గతంలో రూ.2 లక్షలు వసూలు చేసేవారు.. ఇప్పుడు రూ.3 లక్షలు ఏమిటని నిరుద్యోగులు దళారులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో నుంచి కాంట్రాక్టర్, సింగరేణి అధికారులు, యూనియన్ లీడర్లకు సమర్పించుకోవాల్సి ఉంటుందని దళారులు బహిరంగంగానే చెప్తున్నట్టు నిరుద్యోగులు పేర్కొన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణి ఉపాధి చూపించాల్సి ఉండగా వారి నుంచి కూడా దళారులు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, 5, 6, 8 ఇైంక్లెన్, ఓసీ-2, 3తో పాటు పలు డిపార్ట్మెంట్లలో సింగరేణి సంస్థ పర్మనెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నది. సంస్థకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం వీరు పనిచేయాలి. ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాలో 68 మంది పర్మనెంట్, 116 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థలో భూములు కోల్పోయిన వారికి సెక్యూరిటీ గార్డులుగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా అధిక శాతం నాన్ లోకల్ వారితోనే భర్తీ చేస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం మరో 27మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల రిక్రూట్మెంట్కు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. 27 మందితోపాటు మరో 20 మందిని అదనంగా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీంతో మళ్లీ పైరవీల పర్వం ప్రారంభమైంది. 27 మందితోపాటు మరో 20 మంది రిలీవర్లు అంటే 47 మంది నుంచి రూ.3 లక్షల చొప్పున సగటున రూ.కోటి వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దళారులు నిరుద్యోగుల బయోడేటా, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుని డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలావుండగా ఇప్పటికే సుమారు 30 మంది వద్ద దళారులు డబ్బులు తీసుకుని మెడికల్, వీటీసీ చేయించి నేరుగా డ్యూటీలో చేర్పించేందుకు సిద్ధ్దంచేసి ఉంచారు. ఇప్పుడు మెడికల్, వీటీసీ పూర్తి చేసిన వారిని చేర్పిస్తారా? లేక కొత్త వారిని చేర్పిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. కొత్తవారిని చేర్పిస్తే ఇప్పటికే మెడికల్, వీటీసీ చేసిన వారు ఆందోళనకు దిగే అవకాశాలున్నాయి.
ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాం. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. నేను పైరవీలను ఏ మాత్రం లెక్క చేయను. డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారనే విషయమై విచారణ జరిపిస్తా. ఇప్పటికే మెడికల్, వీటీసీ చేసిన వారితో మాకు సంబంధం లేదు. దళారులను నమ్మిమోసపోవద్దు.
– రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం