సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం మూడో సీడ్ సింధు 21-15, 21-7తో సయేనా కవాకమీ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. అరగంటలోనే ముగిసిన ఏకపక్ష పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు.. 38వ ర్యాంకర్‌పై వరుస గేమ్‌ల్లో విజృంభించింది. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం చేజిక్కించుకున్న తెలుగమ్మాయి.. ఒక్క సూపర్-500 టైటిల్ కూడా పట్టలేకపోయింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్‌లో విజేతగా నిలిచినా.. ఆ రెండు సూపర్-300 టోర్నీలు కావడం గమనార్హం. ప్రధాన పోటీదారులు బరిలో లేకపోవడంతో అలవోక విజయాలతో ముందుకు సాగుతున్న సింధు.. ఆదివారం తుదిపోరులో వాంగ్ జీ యీతో తలపడనుంది..