సింగపూర్: బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. స్టార్ షట్లర్లతో కూడిన భారత బృందంలో మొదటి రోజు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగిల్స్ విభాగాల్లో రెండో రౌండ్‌కు ముందంజ వేయగా ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి, మాళవిక బన్సోద్, అన్మోల్ ఖర్బ్ తొలి రౌండ్‌కే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 21-14, 21-9తో వెన్ యు ఝంగ్ (కెనడా)పై అలవోక విజయం సాధించింది. 31 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు.. రెండో రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యు ఫీ (చైనా)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్.. 19-21, 21-16, 21-14తో తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన డెన్మార్క్ షట్లర్ రస్మస్కు షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధృవ్ కపిల ద్వయం 18-21, 13-21తో చైనా జంట చెంగ్ జింగ్ – జంగ్ చి చేతిలో ఓడారు.