ఓటమితో ఆరంభం

- తొలి పోరులో సింధు, శ్రీకాంత్ పరాజయం
- చెమటోడ్చినా తప్పని నిరాశ
- వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. స్టార్ షటర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా పరాజయం పాలయ్యారు. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా.. మహిళల సింగిల్స్ పోరులో వరల్డ్ చాంపియన్ సింధు 21-19, 12-21, 17-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ తైజూ యింగ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21-15, 16-21, 18-21తో మూడో ర్యాంకర్ అండెర్స్ ఆంటోసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. గత వారం తనను థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఓడించిన రచనోక్ ఇంటనోన్తో సింధు తర్వాతి మ్యాచ్ ఆడనుంది. ఇక నాలుగో సీడ్ వాంగ్ జూవీతో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ తలపడనున్నాడు.
తొలి గేమ్‌లో మెరిసినా..
సింధు, తైజూ మధ్య తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ఆరంభంలో చైనీస్ తైపీ ప్లేయర్ దూసుకెళ్లింది. ఓ దశలో 10-14తో తెలుగమ్మాయి వెనుకబడింది. ఆ తర్వాత బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో అదరగొట్టిన సింధు 16-16తో సమం చేయడం సహా చివర్లో వరుస పాయింట్లతో గేమ్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్ ప్రారంభంలో సింధు తప్పిదాలు చేయడంతో తైజూ ఏకంగా 6-0తో దూసుకెళ్లింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించి ఫలితాన్ని నిర్ణయాత్మక గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో 3-6తో వెనుకబడ్డా ఓ దశలో భారత ప్లేయర్ పుంజుకుంది. 13-14కు అంతరాన్ని తగ్గించింది. బలమైన షాట్లతో విరుచుకుపడ్డ తైపీ స్టార్ మూడు వరుస పాయింట్లతో దూసుకెళ్లి.. చివరికి 21-17తో రౌండ్ దక్కించుకుంది. గతవారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో ఓడిన సింధుకు ఇది మెరుగైన ప్రదర్శనగానే చెప్పొచ్చు. తైజూతో 21 సార్లు తలపడిన సింధుకు ఇది 16వ ఓటమి.
నిలబడి.. తలబడి
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ ఆరంభంలో సత్తాచాటాడు. తొలి గేమ్‌లో అండెర్స్ ఆంటోసెన్కు షాకిచ్చిన శ్రీకాంత్ 7-1తో దూసుకుకెళ్లాడు. అయితే ఆ తర్వాత అనవసర తప్పిదాలకు పాల్పడడంతో ఆధిక్యం 12-12కు పడిపోయింది. ఆ దశలో అద్భుతమైన బ్యాక్ ఫ్లిప్‌తో పుంజుకున్న శ్రీకాంత్ ఎక్కడా ఆగలేదు. నాలుగు వరుస పాయింట్లు సాధించడంతో పాటు 19-13కు దూసుకెళ్లి తొలిగేమ్ దక్కించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో డానిష్ ప్లేయర్‌కు శ్రీకాంత్ పోటీనివ్వలేకపోయాడు. ఓ దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15-16కు దూసుకెళ్లినా.. చివర్లో ఆంటోసెన్ స్మాష్‌లకు బదులివ్వలేకపోయాడు. మూడో గేమ్ శ్రీకాంత్, డానిష్ ప్లేయర్ మధ్య హోరాహోరీగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలతో ఇద్దరూ చెమటోడ్చారు. 17-17తో పాయింట్లు సమమైనా చివర్లో ఒత్తిడిని అధిగమించి అండెర్స్ వరుస పాయింట్లు సాధించడంతో శ్రీకాంత్‌కు ఓటమి తప్పలేదు.
తాజావార్తలు
- షాకింగ్ : సంతానం కలగలేదని మహిళను కడతేర్చారు!
- ‘ముద్ర’లో తెలంగాణపై కేంద్రం వివక్ష : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ