Srikkanth : భారత జట్టు మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్లను అతడు ఎంపిక చేయలేదు. అంతేకాదు నలుగురు పేసర్లు చాలని అన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్ పర్యటనలో విఫలమైన గిల్, ఠాకూర్.. ఈ ఇద్దరు ఆటగాళ్లు నా లిస్టులో లేరు. మీడియం పేసర్లుగా బుమ్రా, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, సిరాజ్ సరిపోతారు. ఈ విషయాన్ని ఒక అభిమానిగా కాదు.. చీఫ్ సెలక్టర్‌గా చెప్తున్నాను. అదనపు బౌలర్‌గా పార్ట్ టైమ్ స్పిన్నర్ దీపక్ హూడాను తీసుకోవాలి. వీళ్లు మ్యాచ్‌ను గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. అంతేకాదు టీమిండియాకు యూసుఫ్ పఠాన్ లాంటి గెలుపు గుర్రాలు కావాలి. అలాంటి ప్లేయర్స్ ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తారు’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.
ఈ ప్లేయర్స్ పదింటిలో మూడు మ్యాచ్‌లు గెలిపించగలరు. అయితే.. వీళ్లు నిలకడగా ఆడాలని మాత్రం అనుకోవద్దు. అలానే రిషభ్ పంత్ నుంచి ప్రతి మ్యాచ్‌లో పరుగులు ఆశించొద్దు. నిలకడగా ఆడడం కాదు మ్యాచ్‌లు గెలవడం చాలా ముఖ్యమని ఈ మాజీ సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది టీమిండియా ఆడనున్న మెగా టోర్నీల్లో వన్డే వరల్డ్ కప్ ఒకటి. అక్టోబర్- నవంబర్ మధ్య స్వదేశంలో జరగనున్న ఈ టోర్నీలో కప్పు కొట్టాలనే లక్ష్యంతో భారత జట్టు ఉంది. వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 20మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా షార్ట్ లిస్టులో ఉండే 20మంది పేర్లను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీకాంత్ సభ్యుడు. ఆ తర్వాత అతను చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.